Anupam Kher: ‘సైయారా’ మూవీ బ్లాక్‌బస్టర్ కావడం నన్ను బాధించింది.. అనుపమ్ ఖేర్ కామెంట్స్
Anupam Kher: బాలీవుడ్ సీనియర్ నటుడు, దర్శకుడు అనుపమ్ ఖేర్ ఇటీవల తన కెరీర్‌లో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని పంచుకున్నారు. తాను దర్శకత్వం వహించిన ‘తన్వి ది గ్రేట్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎదురైన అపజయం గురించి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో విడుదలైన ‘సైయారా’ సినిమా అనూహ్య విజయం తమ సినిమాపై తీవ్ర ప్రభావం చూపించిందని ఆయన అన్నారు.
‘తన్వి ది గ్రేట్’ సినిమా కోసం తాను నాలుగేళ్లు కష్టపడ్డానని, ఒక ఏడాది స్క్రిప్ట్, మరో సంవత్సరం సంగీతం కోసం పనిచేశానని అనుపమ్ ఖేర్ తెలిపారు. అయితే, యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ‘సైయారా’తో పాటే తమ సినిమాను విడుదల చేయడంతో తమకు నిరాశే ఎదురైందని చెప్పారు. “సైయారాకు వచ్చిన ఆదరణ ముందు మా సినిమా నిలబడలేకపోయింది. దీంతో అది డిజాస్టర్‌గా మిగిలిపోయింది. నాతో పాటు మా టీమ్‌లో ఉన్న 200 మంది చాలా నిరాశ చెందారు,” అని ఆయన గుర్తు చేసుకున్నారు.
‘తన్వి ది గ్రేట్’ నిర్మాణ సమయంలో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల గురించి కూడా అనుపమ్ ఖేర్ వివరించారు. నిధులు సరిగా లభించక ఒక నెలపాటు సినిమా విడుదలను వాయిదా వేయాల్సి వచ్చిందని తెలిపారు. తన స్నేహితుల ఆర్థిక సహాయంతో ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని పూర్తి చేయగలిగానని చెప్పారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, భారత రాష్ట్రపతి ముందు తమ చిత్రాన్ని ప్రదర్శించినప్పుడు ప్రశంసలు దక్కాయని, కానీ ప్రేక్షకులు మాత్రం ఆదరించలేదని ఆయన బాధపడ్డారు.
ప్రేక్షకులు ప్రేమ కథలను చూడాలనుకుంటున్నారని, అందుకే ‘సైయారా’కు అసాధారణ ఆదరణ లభించిందని అనుపమ్ ఖేర్ అభిప్రాయపడ్డారు. అదే సమయంలో, “మన ఇండస్ట్రీలో ఒకేసారి రెండు సినిమాలు విడుదలైనప్పుడు, ఆదరణ పొందిన సినిమా కోసం వేరే సినిమాను 400 థియేటర్ల నుంచి కూడా నిర్మొహమాటంగా తీసేస్తారు. ఇది మాకు ఎదురైన వాస్తవం,” అని ఆయన సినీ పరిశ్రమలోని కఠినమైన పరిస్థితులను స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి.