Anupama Parameswaran: ‘పరదా’పై విమర్శలకు అనుపమ కౌంటర్..!
Anupama Parameswaran: నటి అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన ‘పరదా’ చిత్రం ఇటీవల విడుదలైన తర్వాత ఎదురైన విమర్శలపై చిత్ర బృందం స్పందించింది. సినిమా విజయంపై ఆశావహంగా ఉన్న దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల, నటి అనుపమ తమ ఆవేదనను వెల్లడించారు. సినిమా విడుదలైన తర్వాత ఎదురైన మిశ్రమ స్పందనపై వారు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
అనుపమ మాట్లాడుతూ, ‘పరదా’ చిత్రం తన కెరీర్‌లోనే అత్యంత ప్రియమైన వాటిలో ఒకటి అని తెలిపారు. “ప్రేక్షకుల అభిరుచులు వేరు వేరుగా ఉంటాయి. కొందరు వినోదాత్మక చిత్రాలను కోరుకుంటే, మరికొందరు కథాబలం ఉన్న సినిమాలను చూడాలనుకుంటారు. ‘పరదా’ ఒక ప్రయోగాత్మక చిత్రం. కానీ, కొంతమంది ఇందులో చిన్న చిన్న తప్పులను భూతద్దంలో వెతికి హైలైట్ చేస్తున్నారు. అదే ఒక కమర్షియల్ సినిమాలో అలాంటి తప్పులు ఉన్నా పట్టించుకోరు. కానీ, నాయికా ప్రాధాన్య చిత్రాల విషయంలో ఈ పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఇలాంటి చిత్రాలను ప్రేక్షకులు ప్రోత్సహిస్తేనే కొత్త కంటెంట్ వస్తుంది” అని ఆమె కోరారు.
దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల మాట్లాడుతూ, తెలుగు ప్రేక్షకులు కథాబలం ఉన్న చిత్రాలను ఆదరిస్తారని నమ్మి ఈ సినిమాను తెరకెక్కించానని, కానీ విమర్శలు తనను బాధపెట్టాయని భావోద్వేగానికి గురయ్యారు. “ముఖం కనిపించకుండా నటించడానికి ఏ హీరోయిన్ అంగీకరిస్తుంది? కానీ అనుపమ ఈ కథను నమ్మి ధైర్యంగా ముందుకు వచ్చారు.
ఆమె నటనకు జాతీయ అవార్డు వస్తుందని ఆశిస్తున్నా. సినిమా విడుదలైన వెంటనే జడ్జ్ చేయొద్దు” అని ఆయన కోరారు. ‘పరదా’లో అనుపమ నటనపై ఇప్పటికే పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమాలో రాగ్ మయూర్ ఒక ముఖ్య పాత్ర పోషించారు. సినిమాను ఇంకా చూడని ప్రేక్షకులు ఈ కొత్త తరహా కథను థియేటర్లలో చూడాలని చిత్ర బృందం కోరింది.