Kalki 2: కల్కి 2 నుంచి దీపికా ఔట్.. ఆ స్టార్ హీరోయిన్ కావాలంటూ ఫ్యాన్స్ డిమాండ్
Kalki 2: ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఎ.డి.’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ రూ.1100 కోట్లకు పైగా వసూళ్లతో రికార్డులు సృష్టించింది. ఈ సినిమాకు కొనసాగింపుగా తెరకెక్కుతున్న ‘కల్కి 2’ నుంచి దీపికా పదుకొణె వైదొలిగిన విషయం తెలిసిందే. కీలకమైన సుమతి పాత్ర నుంచి దీపికా తప్పుకోవడంతో ఇప్పుడు ఆ రోల్‌లో ఎవరు చేయనున్నారన్నది హాట్ టాపిక్‌గా మారింది.
ప్రభాస్ అభిమానులు మాత్రం ఈ పాత్రకు తమ అభిమాన నటి అనుష్క శెట్టిని తీసుకోవాలని బలంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రభాస్ – అనుష్క కాంబినేషన్ అంటే బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయం ఖాయమనే నమ్మకం అభిమానుల్లో ఉంది. వారిద్దరి కెమిస్ట్రీకి ‘బాహుబలి’ సిరీస్ ఒక ఉదాహరణగా నిలిచింది. అనుష్కతో పాటు నయనతార, సమంత, ఆలియా భట్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి, ‘కల్కి 2’లో ప్రభాస్ సరసన ఎవరు నటిస్తారన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే. ఇక ఈ సినిమాలో కమల్ హాసన్ పాత్రకు మరింత ప్రాధాన్యత ఉంటుందని, ఆయన పాత్ర కథను మలుపు తిప్పుతుందని తెలుస్తోంది.
దీపికా పదుకొణె కొన్ని రోజుల క్రితం స్పిరిట్ మూవీ నుండి కూడా తప్పుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో కూడా ప్రభాసే హీరో కావడం గమనార్హం. పని గంటల విషయంలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు, దీపికా పదుకొణెకు మధ్య వివాదం తలెత్తినట్లు అప్పుడు ఇండస్ట్రీ నుంచి వినిపించింది. అలాగే 20- 25 మంది ఉండే దీపికా టీమ్‌కు కూడా ఫైవ్ స్టార్ సదుపాయాలు కల్పించాలన్న డిమాండ్‌ను కూడా సందీప్ రెడ్డి అంగీకరించలేదని తెలిసింది. దీంతో దీపికాను మూవీ నుంచి సందీప్ తొలగించాడు.
ఆ తరువాత ఆమె స్థానంలోకి త్రిప్తి డిమ్రీని తీసుకున్న సంగతి తెలిసిందే. దీనికి ప్రతి చర్యగా ఆమె పీఆర్ టీం స్పిరిట్ స్టోరీని లీక్ చేసిందట. దీంతో దీపిక పదుకొణె , ఆమె పీఆర్ మీద సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. డర్టీ పీఆర్ గేమ్స్ అంటూ సందీప్ రెడ్డి తీవ్ర స్థాయిలో ట్విట్టర్ వేదికగా మండి పడ్డాడు. మీరు ఇలా ఏం చేసినా నన్ను ఏం కదిలించలేరు.. ఈ సారి మొత్తం స్టోరీని లీక్ చేసుకోండి అంటూ రెబల్ స్టైల్లో ట్వీట్ వేశాడు సందీప్ రెడ్డి వంగా. దీపిక స్థానంలో యంగ్ గర్ల్ అయిన త్రిప్తి డిమ్రీని తీసుకోవడంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇదేనా మీ ఫెమినిజం అంటూ సందీప్ రెడ్డి వంగా కౌంటర్లు వేశాడు.