ఏపీ బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న హిందు వ్యతిరేక విధానాలను ఖండిస్తూ ప్రభుత్వానికి ఘాటైన లేఖాస్త్రం సంధించారు. వరుస హిందూ వ్యతిరేక సంఘటనలపై సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో విచారణ జరిపి దోషులను శిక్షించాలని కోరారు. ఆయన రాసిన లేఖలోని సారాంశం ఏమిటంటే..
తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో పరిధిలోని ప్రఖ్యాతిగాంచిన అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలో రథం అగ్నికి ఆహుతి కావడం ఆందోళన కలిగిస్తుంది.
ఏటా జరిగే శ్రీ స్వామివారి కళ్యాణ సమయంలో స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా రాష్ట్రేతర ప్రాంతాల నుండి, విదేశాల నుండి కూడా అంతర్వేది ఉత్సవాలకు లక్షలాదిమంది భక్తులు తరలి వస్తుంటారు. స్వామివారి రథోత్సవం కనులారా తిలకిస్తే తమ జన్మ సాఫల్యం అయినట్లుగా హిందువులుగా జన్మించిన ప్రతి ఒక్కరూ భావిస్తారు. తరతరాలుగా ఈ రథోత్సవానికి గల ప్రాధాన్యతను గుర్తించిన ఆలయ వంశపారంపర్య ధర్మకర్త లు 1958లో ఈ భారీ రథాన్ని తయారు చేయించారు. గత 62 సంవత్సరాలుగా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి సేవలో ఈ రథం తరిస్తుంది. అటువంటి రథం దగ్ధం కావడం లక్షలాది మంది భక్తులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. హిందూ మనోభావాలు దెబ్బతినే రీతిలో దగ్ధమైంది ప్రమాదవశాత్తు దగ్ధం అయ్యిందా? లేక ఎవరైనా దుండగులు ఉద్దేశపూర్వకంగా ఈ చర్యకు పాల్పడ్డారా? అనేది స్పష్టం కావాల్సి ఉంది.
ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని శాఖాపరమైన నిర్లక్ష్యం అయితే సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని దుండగుల దుశ్చర్య అయితే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాను. అలానే గతంలో చిత్తూరు జిల్లా బిట్రగుంట వెంకటేశ్వర స్వామి వారి రథాన్ని తగులబెట్టారు. ఆ రథం విలువ సుమారు 70 లక్షల రూపాయలు. ప్రభుత్వం ఇవన్నీ మతిస్థిమితం లేని వాళ్ళు చేస్తున్నారని చెబుతున్నారు. పిఠాపురం పదుల సంఖ్యలో దేవతా విగ్రహాలు పగలగొట్టిన కేసులో మతిస్థిమితం లేని వాళ్ళు చేశారని కేసు కొట్టేశారు. పైన తెలిపిన సంఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి దోషులను శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఈ వరుస ఘటనలపై బిజేపీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోందని తెలియజేస్తున్నాను. దేవాలయంపై దాడి జరిగిన మరీ ముఖ్యంగా హిందువుల మనోభావాలు దెబ్బతీయాలని చూసిన బిజెపి తరఫున మేము సిద్ధంగా ఉన్నామని ఆయన విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు
