దేశ రాజకీయాల్లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న బిజెపి, రాష్ట్ర సారథిగా సోమువీర్రాజుని నియమించిన తరువాత అత్యంత వేగంగా పార్టీ నిర్మాణంపై దృష్టిసారించింది. పార్టీ అధిష్టానం ఆలోచనల్ని తూచ తప్పకుండా అమలు చేస్తూ వివిధ పార్టీల నుండి బీజేపీలోకి నాయకులను ఆహ్వానిస్తున్న సోము వీర్రాజు, ఇప్పుడు కార్యకర్తలకు సంస్థాగత ప్రశిక్షణా తరగతులు ప్రారంభించారు.
విశాఖపట్నం లో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా భాజపా సహా ఇంచార్జి సునిల్ దేవధర్ పాల్గొన్నారు. భాజపా ప్రధాన కార్యదర్శులు పివిఎన్ మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి, సూర్యనారాయణ రాజు. గాంధి తదితరులు హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్ లో భాజపా కు అధికారం తీసుకొచ్చేలా 175 నియోజకవర్గ స్థాయి సమావేశాలను విశాఖపట్నం నుండి ప్రారంభించినట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. 2024 లో పార్టీ విజయమే లక్ష్యం గా కార్యకర్తలు ముఖ్య నాయకులతో సుదీర్ఘ సమయం చర్చించారు. బూత్ స్థాయి వరకూ కార్యకర్తలు నిర్మాణ పటిష్ఠతకు పిలుపునిస్తూ, ఇలాంటి ప్రశిక్షణా తరగతులు ప్రతీ నియోజకవర్గ ముఖ్యకేంద్రములో నిర్వహణ మొదలు పెట్టబోతున్నట్లు, ఏపీలో 30 రోజులపాటు ఈ సమావేశాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
అంతకు ముందు విజయనగరం జిల్లాలో టిడిపి నుండి మాజీ శాసనసభ్యులు గద్దె బాబూరావు, పార్వతీపురం నియోజకవర్గం నుండి వైసిపి నాయకుడు శ్రీనివాస్ లు పెద్ద ఎత్తున తమ అనుచరులతో సోము వీర్రాజు సమక్షంలో పార్టీలో చేరారు. రాష్ట్ర వ్యాప్తంగా చాప కింద నీరులా పార్టీలోకి ముఖ్య నాయకులను ఆహ్వానిస్తూ ప్రతి నియోజకవర్గంలోనూ బలమైన నాయకులను, సంస్థాగత నిర్మాణాన్ని ఏర్పాటు చేసే దిశగా సోము వీర్రాజు అడుగులు వేస్తున్నారు. ఉగాది లోపు పార్టీ నిర్మాణాన్ని పూర్తిచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని సమాచారం.
వీర్రాజు దూకుడు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో రాష్ట్రంలో బిజెపి బలం పుంజుకుని ఒక బలమైన శక్తిగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
