రచ్చహః రచ్చస్య రచ్చోభ్యహ ఈపదం గత మార్చిలో వాయిదా వేసిన స్థానిక ఎన్నికల విషయంలో కరెక్టుగా సరిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి మధ్య జరిగిన రచ్చ దానిపై జరిగిన చర్చ పతాక స్థాయికి చేరి ఒకరిపై ఒకరు సుప్రీంకోర్టు వరకు వెళ్లి పై చేయి సాధించడానికి చేసిన ప్రయత్నాలు, వాటిపై రాష్ట్ర మీడియా వండి వార్చిన కథనాలు అంత త్వరగా మన దృష్టి పదం నుండి మరువలేము.
కోవిడ్ కారణంగా వాయిదాపడిన స్థానిక ఎన్నికల విషయంలో ప్రభుత్వం కోర్టుల నుండి ఎన్నో సార్లు అక్షింతలు వేయించుకుని తప్పనిసరి పరిస్థితుల్లో తగ్గాల్సి వచ్చింది. కోర్టు ఆదేశాలతో తిరిగి పునర్నియామకం అయిన నిమ్మగడ్డ రమేష్ ఇప్పుడు స్థానిక ఎన్నికల సంకుల సమరానికి తెరలేపి ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
తాజాగా తెలంగాణ స్థానిక ఎన్నికలు డిసెంబర్ లో జరగనున్న నేపథ్యంలో ఏపీ నుండి 17వేల బ్యాలెట్ బాక్సులను పంపించారు. మరో 13 వేల బ్యాలెట్ బాక్సులను తరలించనున్నారు. డిసెంబర్లో తెలంగాణ స్థానిక ఎన్నికలు ముగిశాక ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది.
అన్నీ సవ్యంగా జరిగితే జనవరిలో ఏ పి స్థానిక ఎన్నికల పందెపు బరులు సిద్ధం అవుతాయి. దీనికొరకు పార్టీలు సిద్ధం అవ్వాల్సిన సమయం దగ్గరపడింది. కేవలం నాలుగైదు కరోనా కేసులు ఉన్నప్పుడు వాయిదాపడిన ఎన్నికలు వేలకొద్దీ కరోనా కేసులు నమోదవుతున్న ఈ సమయంలో ఎలా నిర్వహిస్తారంటూ వాదనలు ఒకవైపు వినిపిస్తుండగా ఎన్నికల కమిషనర్ మాత్రం నిశ్శబ్దంగా తన కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.