Johnny Master: జానీ మాస్టర్‌తో ఏఆర్ రెహమాన్ ఫొటో.. విమర్శలతో నెట్టింట రచ్చ
Johnny Master: ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, అంతర్జాతీయంగా పేరుగాంచిన సంగీత దిగ్గజం, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ తో కలిసి దిగిన ఒక ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ ఫొటోను జానీ మాస్టర్ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకోగా, ఈ సంఘటన రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ ప్రమోషన్స్‌లో భాగంగా జరిగినట్లు తెలుస్తోంది. అయితే, ఫొటో షేర్ చేసిన వెంటనే నెటిజన్ల నుంచి ఊహించని విధంగా తీవ్ర వ్యతిరేకత మొదలైంది.
జానీ మాస్టర్‌పై గతంలో లైంగిక ఆరోపణలు ఉన్నాయని గుర్తు చేస్తూ, అలాంటి వ్యక్తితో కలిసి ఏఆర్ రెహమాన్ ఫొటో దిగడంపై నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొందరు నెటిజన్లు రెహమాన్‌ను తప్పుబడుతూ వ్యాఖ్యానించగా, మరికొందరు జానీ మాస్టర్‌ను విమర్శిస్తున్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తిని ప్రముఖ దర్శకులు, సంగీతకారులు అక్కున చేర్చుకోవడం ఏమిటంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు.
గాయని చిన్మయి శ్రీపాద కూడా ఈ వివాదంపై స్పందించారు. “ఏఆర్ రెహమాన్ గారికి ఈ వివాదం గురించి పూర్తిగా అవగాహన ఉండకపోవచ్చు. ఒకవేళ తెలిసి ఉంటే, ఆయన జానీ మాస్టర్‌తో కలిసి ఫొటో దిగి ఉండేవారు కాదేమో” అంటూ చిన్మయి పరోక్షంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘మీ టూ’ ఉద్యమంలో మహిళలకు మద్దతుగా నిలిచిన చిన్మయి, ఈ సంఘటనపై తన అభిప్రాయాన్ని వెల్లడించడంతో ఈ వివాదం మరింత వేడెక్కింది.
మరోవైపు లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తిని మళ్లీ పెద్ద ప్రాజెక్టులలో, ముఖ్యంగా ‘పెద్ది’ వంటి భారీ చిత్రంలో ఎలా భాగం చేసుకున్నారంటూ నెటిజన్లు చిత్ర బృందాన్ని ప్రశ్నిస్తున్నారు. సినిమాల్లో ఇలాంటి వ్యక్తులను మళ్లీ ప్రోత్సహించడం సరికాదంటూ నెటిజన్లు విమర్శలు గుప్పించడంతో, ఈ మొత్తం వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. చిత్ర బృందం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.
