Sandeep Reddy Vanga: సీఎం సహాయ నిధికి రూ.10 లక్షలు విరాళమిచ్చిన సందీప్ రెడ్డి వంగా..!
Sandeep Reddy Vanga: ఇటీవల తెలంగాణలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఈ కష్టకాలంలో వరద బాధితులకు అండగా నిలిచేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా, ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.10 లక్షల విరాళం అందించారు. తన సోదరుడు ప్రణయ్‌రెడ్డితో కలిసి సందీప్‌రెడ్డి వంగా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు.
భద్రకాళి ప్రొడక్షన్స్ తరఫున ఈ విరాళాన్ని అందజేస్తున్నట్లు సందీప్‌రెడ్డి వంగా తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం సీఎం సహాయనిధి చేస్తున్న కృషికి ఇది తమవంతు చిన్న సాయమని ఆయన పేర్కొన్నారు. వరంగల్‌కు చెందిన ఈ దర్శకుడు తన రాష్ట్ర ప్రజలకు ఆపద వచ్చినప్పుడు స్పందించడంపై అభిమానులు, నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి కూడా సందీప్‌రెడ్డి వంగా చేసిన సాయాన్ని అభినందించారు.
ఈ విపత్కర పరిస్థితుల్లో సినీ పరిశ్రమ నుంచి చాలామంది మౌనంగా ఉండటంపై నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. “ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు లక్షలు, కోట్లు విరాళాలు ఇచ్చే తెలుగు సినీ ప్రముఖులు, ఇప్పుడు తెలంగాణ విషయంలో ఎందుకు స్పందించడం లేదు?” అని ప్రశ్నిస్తున్నారు. సందీప్‌రెడ్డి వంగా తన బాధ్యతగా ముందుకొచ్చి సాయం చేయడంతో, ఇకనైనా మరికొందరు సినీ ప్రముఖులు స్పందించి సహాయం చేస్తారని నెటిజన్లు ఆశిస్తున్నారు.
‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి విజయవంతమైన చిత్రాలను రూపొందించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సందీప్‌రెడ్డి వంగా, తన సామాజిక బాధ్యతను చాటుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.