Baahubali The Epic: ‘బాహుబలి’ రీ-రిలీజ్లోనూ బాక్సాఫీస్ రికార్డులు.. రూ.5 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్
Baahubali The Epic: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సృష్టించిన విజువల్ వండర్, భారతీయ సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచిన ‘బాహుబలి’ ఫ్రాంచైజీ మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో రెండు భాగాలను కలిపి ఒకే చిత్రంగా మెరుగైన సాంకేతిక హంగులతో అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ రీ-రిలీజ్ హవా ప్రస్తుతం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.
సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. రీ-రిలీజ్ విభాగంలో ఈ చిత్రం సంచలనం సృష్టిస్తోంది. అంచనాలను మించి ‘బాహుబలి: ది ఎపిక్’ ఇప్పటికే రూ.5 కోట్లకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు ధృవీకరించాయి. ఇప్పటివరకు రీ-రిలీజ్ అయిన చిత్రాల చరిత్రలో అత్యధిక అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు చేసుకున్న చిత్రంగా ‘బాహుబలి’ నిలవబోతోంది. పదేళ్ల క్రితం విడుదలైన సినిమాకు ఈ స్థాయిలో స్పందన లభించడం రాజమౌళి విజన్, చిత్ర ప్రభావం ఎంత గొప్పదో తెలుపుతుంది.
‘బాహుబలి: ది ఎపిక్’ను కేవలం పాత సినిమాను మళ్లీ విడుదల చేయడం కాకుండా, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చేలా మేకర్స్ సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని రీమాస్టర్డ్ పిక్చర్ మరియు సౌండ్ క్వాలిటీతో పాటు, అత్యాధునిక ప్రీమియం ఫార్మాట్లలో విడుదల చేయనున్నారు. ఐమాక్స్ (IMAX), 4DX, డాల్బీ సినిమా వంటి ఫార్మాట్లలో ఈ సినిమాను వీక్షించే అవకాశం లభిస్తోంది. దీనివల్ల బాహుబలి మాయాజాలాన్ని బిగ్ స్క్రీన్‌పై ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా అనుభవించే అవకాశం ప్రేక్షకులకు దక్కనుంది.
‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్’ చిత్రాలను కలిపి సింగిల్ వెర్షన్‌గా రూపొందించిన ఈ చిత్రం మొత్తం నిడివి దాదాపు 3 గంటల 44 నిమిషాలుగా ఖరారు చేశారు. ఇటీవలే సెన్సార్ ప్రక్రియ కూడా పూర్తయింది. భారీ విజువల్స్, అద్భుతమైన కథా కథనం, ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక విలువలతో ‘బాహుబలి’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. పదేళ్ల తర్వాత కూడా ఐమాక్స్ వంటి ప్రీమియం ఫార్మాట్లలో ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్‌పై చూడటానికి ప్రేక్షకులు అమితాసక్తితో ఎదురుచూస్తున్నారు. ‘బాహుబలి’ సృష్టించిన ప్రభావం, అప్పటికీ, ఇప్పటికీ చెక్కుచెదరలేదని రీ-రిలీజ్ బుకింగ్స్ స్పష్టం చేస్తున్నాయి.
