Baahubali: ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ వివాదం.. ‘కుంగ్ ఫూ పాండా’ కాపీనా? ట్రోలింగ్‌పై దర్శకుడు క్లారిటీ
Baahubali: భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన ‘బాహుబలి’ ఫ్రాంచైజీ ఇప్పుడు మరో భారీ ప్రయోగానికి సిద్ధమైంది. ఎస్.ఎస్. రాజమౌళి – ప్రభాస్ కాంబినేషన్‌లో సంచలనం సృష్టించిన ఈ కథను, ఈసారి యానిమేషన్ రూపంలో గ్లోబల్ ప్రేక్షకులకు అందించబోతున్నారు. ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ పేరుతో రూపొందుతున్న ఈ యానిమేషన్ సిరీస్, లైవ్ యాక్షన్ వెర్షన్‌కు భిన్నంగా, బాహుబలి యూనివర్స్‌ను కొత్త కోణంలో చూపించనుంది. హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఈ యానిమేషన్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టీజర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో అనూహ్య వివాదం మొదలైంది. టీజర్‌లో చూపించిన ఒక కీలకమైన యాక్షన్ సీక్వెన్స్‌లో పాత్రలు గాల్లో తేలుతూ వేగంగా తలపడుతుండటం కనిపిస్తుంది. ఈ ఫైట్ సీక్వెన్స్ హాలీవుడ్‌లో భారీ విజయం సాధించిన ‘కుంగ్ ఫూ పాండా’ యానిమేషన్ మూవీ సిరీస్‌లోని కొన్ని యాక్షన్ బీట్‌లను పోలి ఉందని నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. స్టైల్‌ను, యాక్షన్ బీట్స్‌ను కాపీ చేశారంటూ పలు ప్లాట్‌ఫార్మ్స్‌లో ట్రోలింగ్ కూడా ఊపందుకుంది.
ఈ వివాదం వేడెక్కడంతో అంతర్జాతీయ యానిమేషన్ కంటెంట్ తయారీలో నిష్ణాతుడైన ఈ చిత్ర దర్శకుడు ఇషాన్ శుక్లా స్పందించాల్సి వచ్చింది. ఈ ఆరోపణలపై ఆయన వెంటనే క్లారిటీ ఇచ్చారు. “నేను వ్యక్తిగతంగా కుంగ్ ఫూ పాండా సినిమా చూడలేదు. అలాగే మా టీమ్ కూడా ఆ చిత్రంలోని సీన్‌కు దగ్గరగా దీన్ని రూపొందించాలనే ఉద్దేశంతో చేయలేదు. రెండు ఫైట్ సీక్వెన్స్‌లు గాల్లోనే జరిగేలా డిజైన్ చేయడంతో, కొందరికి పోలిక అనిపించి ఉండొచ్చు. కానీ మా సీన్‌కు గల కారణం కథలో స్పష్టంగా తెలుస్తుంది. ఇది పూర్తిగా బాహుబలి కథ డిమాండ్ ప్రకారమే రూపొందించబడింది” అని దర్శకుడు తేల్చి చెప్పారు.
దర్శకుడి ఈ వివరణతో యానిమేషన్ సీక్వెన్స్‌పై నెలకొన్న అనుమానాలు పటాపంచలైనట్లు తెలుస్తోంది. ఈ యానిమేషన్ సిరీస్ విడుదలయ్యాక, బాహుబలి బ్రాండ్ మరోసారి గ్లోబల్ మార్కెట్‌లో సత్తా చాటుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
