Bahubali The Eternal War: ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’యానిమేషన్ టీజర్ అదుర్స్.. మీరు చూశారా?
Bahubali The Eternal War: భారత సినీ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మెగా విజువల్ వండర్ ‘బాహుబలి’ అడుగుజాడల్లో, ఇప్పుడు అదే సృష్టికర్త దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి మరొక భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. అదే ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ యానిమేషన్ సిరీస్. ఇటీవల ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో రెండు భాగాలను కలిపి రీ-రిలీజ్ చేసినప్పుడు, థియేటర్లలో ఈ సిరీస్ టీజర్‌ను ప్రదర్శించారు. తాజాగా, ఆ టీజర్ అధికారికంగా విడుదల కావడంతో అభిమానుల్లో ఉత్సాహం ఉప్పొంగింది.
భారీ అంచనాలు నెలకొన్న ఈ యానిమేషన్ సిరీస్ కేవలం ఒక కథకు కొనసాగింపు కాదని, ‘బాహుబలి’కి సంబంధం లేని ఒక కొత్త ఆధ్యాత్మిక విశ్వంలో సాగే యాక్షన్ ఫాంటసీగా ఉండబోతుందని రాజమౌళి బృందం ప్రకటించింది.
కేవలం డైలాగ్‌లతోనే కథపై ఉత్కంఠ పెంచే రాజమౌళి మార్కు ఈ టీజర్‌లో స్పష్టంగా కనిపించింది. శివగామి పాత్రధారి రమ్యకృష్ణ గంభీరమైన వాయిస్ ఓవర్ ఆకట్టుకుంది. “బాహుబలి మరణం ముగింపు కాదు.. ఒక మహా కార్యానికి ఆరంభం.. తన గమ్యం యుద్ధం” అనే డైలాగ్‌తో టీజర్ మొదలైంది.
ఈ టీజర్‌లో అద్భుతమైన, ఊహకందని విజువల్స్ చూపించారు. బాహుబలి ఆత్మ పాతాళ లోకానికి ప్రయాణించడం, శివలింగం ముందు నృత్యం చేయడం, ఆకాశ లోకంలో దేవతలతో భీకర పోరాటం చేయడం వంటి సన్నివేశాలు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్నాయి. ముఖ్యంగా విశాసురుడు – ఇంద్రుడు మధ్య జరిగే యుద్ధ ఘట్టం, బాహుబలి కోసం ఆ యుద్ధం జరగడం, చివరికి విశాసురుడు పరాజయం పాలవ్వడం టీజర్‌కి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మైథాలజికల్ థీమ్, ఫాంటసీ, యాక్షన్ సమపాళ్లలో కలగలిపి ఈ సిరీస్‌కు కొత్త మెరుగులు దిద్దనున్నట్టు తెలుస్తోంది.
ఇషాన్ శుక్లా దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు ఎస్.ఎస్. రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. విజువల్ టెక్నాలజీలో అత్యున్నత ప్రమాణాలను పాటిస్తూ, పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో దీనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇది ఇండియన్ యానిమేషన్ సిరీస్‌లకు కొత్త మార్గాన్ని చూపుతుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు.
