Bala Krishna: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి.. శంకుస్థాపన చేసిన బాలకృష్ణ
Bala Krishna: హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అమరావతిలో కొత్త క్యాన్సర్ కేర్ క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తానని కొద్ది రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తుళ్లూరులో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కొత్త అధునాతన క్యాన్సర్ కేర్ క్యాంపస్‌కు బుధవారం శంకుస్థాపన జరిగింది.
ఈ కార్యక్రమానికి బాలకృష్ణతో పాటు ఆయన కుమార్తె నారా బ్రాహ్మిణి, పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖ వైద్య నిపుణులు, ట్రస్ట్ సభ్యులు హాజరయ్యారు. ఈ ప్రాజెక్ట్ అమరావతి అభివృద్ధిలో ఒక కీలక అడుగు కానుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్జీలు, IAS అధికారుల నివాస భవనాల పనులతో పాటు రూ.55 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.
దేశవ్యాప్తంగా వేలాది క్యాన్సర్ రోగులకు సేవలందించిన బసవతారకం ట్రస్ట్, ఇప్పుడు అమరావతిలో కొత్త క్యాంపస్‌తో తమ సేవలను విస్తరిస్తోంది. తొలి దశలో 500 పడకల సామర్థ్యంతో అత్యాధునిక వైద్య సదుపాయాలను అందించనుంది. ఈ ప్రాజెక్ట్ కోసం రూ. 750 కోట్ల పెట్టుబడితో సుమారు 21 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టనున్నారు. ఇందులో అధునాతన రేడియేషన్, సర్జరీ టెక్నాలజీలు అందుబాటులో ఉంటాయి. 2028 నాటికి ఈ ఆస్పత్రి మొదటి దశ నిర్మాణం పూర్తి కానుంది.
ఈ ఆస్పత్రి నిర్మాణం అమరావతిలో రాజధాని పనులు తిరిగి పుంజుకుంటున్న వేళ మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. రెండో దశలో అదనంగా 500 పడకలు, ప్రత్యేక వైద్య విభాగాలు, ఒక రీసెర్చ్ సెంటర్ కూడా ఏర్పాటు కానుంది. ఈ క్యాంపస్ అమరావతి పరిధిలోని వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు సైతం ప్రపంచ స్థాయి క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ప్రాజెక్ట్‌కు సహకరించిన దాతలు, భాగస్వాములు, శ్రేయోభిలాషులకు బసవతారకం ట్రస్ట్ కృతజ్ఞతలు తెలిపింది. ఈ ఆస్పత్రి నిర్మాణం విజయవంతమై అమరావతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానుంది.