Balakrishna Gopichand: బాలయ్య-గోపీచంద్ మలినేని కాంబోలో మరో మూవీ.. ఈ సారి అరాచకమే..
Balakrishna Gopichand: వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించిన దర్శకుడు గోపీచంద్ మలినేని మరోసారి నటసింహం నందమూరి బాలకృష్ణతో జతకట్టబోతున్న సంగతి తెలిసిందే. ‘NBK111’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 24న పూజా కార్యక్రమాలతో చిత్రీకరణను ప్రారంభించబోతున్నట్టు దర్శకుడు గోపీచంద్ మలినేని అధికారికంగా ప్రకటించారు.
‘వీరసింహారెడ్డి’తో రాయలసీమ నేపథ్యంలో పవర్ ఫుల్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని, ఈసారి బాలయ్యను సరికొత్తగా చూపించడానికి ఒక ఎపిక్ స్టోరీని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం రెండు వేర్వేరు కాలాలకు చెందిన కథాంశాలను కలిగి ఉంటుందని, చరిత్రను, వర్తమానాన్ని ముడిపెడుతూ ఒక రకంగా ‘టైమ్ ట్రావెల్’ తరహాలో కథనం సాగనుందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఈ చిత్రంలో బాలయ్యను మునుపెన్నడూ చూడని విధంగా అత్యంత పవర్‌ఫుల్‌గా చూపించబోతున్నారట. ఇందుకు తగ్గట్టే మేకర్స్ కొన్ని రోజుల క్రితం మొరాకోలో ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వీడియోను చిత్రీకరించారు. నిర్మాతలు ఈ సినిమా విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ఈ భారీ ప్రాజెక్టును వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఇక టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే, ‘కాంతార’ చిత్రానికి పనిచేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అర్వింద్ కశ్యప్ ఈ చిత్రానికి కెమెరామన్‌గా వ్యవహరించనున్నారు. బాలయ్య ఆస్థాన వాయిద్యుడు ఎస్.ఎస్. తమన్ సంగీతాన్ని అందించనున్నారు. ఈ సినిమా బాలయ్య కెరీర్‌లోనే బెస్ట్ వర్క్ ఫిల్మ్‌గా నిలుస్తుందని, కథ తెలిసిన కొందరు టాలీవుడ్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
