Balakrishna Speech : ప్రజలకోసం పోరాటానికే పవన్ కళ్యాణ్ జీవితం….
పవన్ కళ్యాణ్ తన జీవితాన్ని సినిమాలకే కాకుండా ప్రజ సమస్యలపై పోరాటానికి ఎక్కువగా కేటాయిస్తున్నారని కొనియాడారు నందమూరి బాలకృష్ణ.. ఈరోజు యువ గళం నవ శకం సభలో ఆయన ప్రసంగిస్తూ నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగిందని తెలిపారు. ఆనాడు నందమూరి తారక రామారావు ఇచ్చిన పిలుపుకు కులమత వర్గాలకు సంబంధం లేకుండా ప్రజల నుంచి ఎలా అయితే విశేష స్పందన వచ్చిందో.. ఈరోజు లోకేష్ పాదయాత్రకు కూడా అంతే స్పందన వచ్చిందని బాలకృష్ణ అన్నారు. ఇది పాదయాత్ర ముగింపు సభ కాదని, వైసీపీకి అంతిమ యాత్రకు ఆరంభ సభ అంటూ అభివర్ణించారు.
అన్న ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలను చంద్రబాబు కొనసాగించి పేదలకు అండగా నిలిచారనీ.. చంద్రబాబు తన విజన్ తో ఐటీ, డ్వాక్రాలను తీసుకువస్తే.. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి హత్యలు, దోపిడీలు, దౌర్జన్యాలు, విధ్వంసాలు, పరిచయం చేశారంటూ విమర్శించారు. అసలు కూల్చివేతతో పాలన ప్రారంభించిన జగన్ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసి పది లక్షల కోట్ల అప్పు రాష్ట్రంపై మోపారని.. ల్యాండ్, సాండ్, మైనింగ్, స్కాములతో దోచుకున్నారనీ.. అడిగితే అక్రమ కేసులతో బెదిరిస్తున్నారని.. ఉద్యోగులను, కార్మికులను, పోలీసులను జగన్మోహన్ రెడ్డి వేధిస్తున్నాడు అంటూ విరుచుకుపడ్డారు బాలకృష్ణ.
మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే ప్రపంచ పటంలో ఏపీ ఉండదు. వచ్చే ఎన్నికల్లో విజయమో వీర స్వర్గము ప్రజలు తేల్చుకోవాలి అంటూ ఆయన పిలుపు నిచ్చారు.