Banana leaves : భారతదేశంలో హిందూ సంప్రదాయం ప్రకారం చాలా ఆచార సంప్రదాయాలు మనం చూస్తూనే ఉంటాం. కానీ పెరుగుతున్న సాంస్కృతిక నేపథ్యంలో చాలా ఆచారాలను మనం పక్కకు పెట్టేస్తూ ఉంటాం. మోడ్రన్ వ్యవస్థకు అలవాటు పడిపోయి ఆహార నియమాలను కూడా గాలికి వదిలేస్తున్నాం. కానీ మన పూర్వీకులు వాటిని ఎంతో ఖచ్చితంగా పాటించేవారో అంత ఆరోగ్యంగా ఉండేవారు. ఈరోజు మనం సరైన పద్ధతులను పాటించకపోవడం వల్లనే ఎన్నో జబ్బులకు మన శరీరాన్ని నిలయంగా మార్చేస్తున్నాం.
అలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకునేది అరిటాకులో భోజనం చేయడం. అరిటాకులో భోజనం చేయడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. ఎప్పుడైనా ఆలోచించారా.. ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అరిటాకులో ఆహార పదార్థాలను వడ్డించినప్పుడు అవి మనం తినే ఆహార పదార్థాలతో పాటు అరిటాకులో ఉన్న పోషకాలు కూడా మన శరీరంలోకి వెళ్తాయి. అరిటాకులో సహజ యాంటీ మైక్రోబయల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉండే ఫినాలస్ ఫ్లేవనాయిడ్స్, ప్రోయాంతోసైనిడిన్స్ ఉండటంవల్ల ఇవి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అరిటాకులను మనం గమనించినట్లయితే మైనపు పూతలాంటిది ఒక పూత కలిగి ఉంటుంది.
దీంట్లో వేడివేడి ఆహారం వడ్డించినట్లయితే ఆ పూతకి ఆహారం తగిలి ఆ పూత కొద్దిగా కరుగుతుంది. అలా కరగడం వల్ల మన ఆహారం రుచి మరింతగా పెరిగిపోయి, మన శరీరానికి పోషకాలు అందుతాయి. అరిటాకులు కాలుష్య కరమైన ఆకులు మాత్రం కావు. ఎందుకంటే వాటిని ఉపయోగించిన తర్వాత కూడా చెట్లకు కంపోస్ట్ గా వాడుకోవచ్చును. అరిటాకులు ప్రకృతి సహజ సిద్ధం అయినవి. మనం చెప్పుకున్నట్లుగా అరిటాకుపై ఉండే మైనపు పూత వల్ల దానిపైన దుమ్ము, దూళి నిలిచి ఉండవు. తినే ముందు ఒకసారి నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.
అరిటాకు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం : అరిటాకుపై తింటే ఆకుల్లో పాలిఫెనాల్స్ ఉండటం వల్ల అవి మన శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ తో పోరాడి మన శరీరం అనారోగ్యం బారిన పడకుండా రక్షిస్తాయి. ఇంకా గొప్ప విషయం ఏమిటంటే పార్కిన్సన్ వ్యాధికి చికిత్స చేయగల ఎంజైమ్ పాలీఫెనాల్ ఆక్సిడేస్ లక్షణాలు కూడా ఉంటాయంట, ఇవి జీర్ణక్రియకు ఎంతో సహాయపడతాయి. ఆహారంలో మనకు తెలియకుండా ఉన్న బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి.
అరిటాకులు తాజాగా ఉంచుకోవడం కొరకు వాటిని ఒక క్లాత్ లో చుట్టి గాలి తగలకుండా ప్లాస్టిక్ సంచిలో భద్రపరచాలి. లేదా ఒక బ్యాగులో పెట్టి ఫ్రిడ్జ్ లో ఉంచినా కూడా ఒక 10 నుంచి 15 రోజులకు వరకు తాజాగా ఉంటాయి. ఎప్పుడు ప్లేట్స్ లల్లోనే కాకుండా ఇలా అప్పుడప్పుడైనా అరిటాకులలో తిని మీ ఆరోగ్యాన్ని రక్షించుకోండి.