Bandla Ganesh: “నేను ఇచ్చింది బ్లాక్‌బస్టర్ బ్రేక్, ఫ్లాపులు కాదు”.. సెకండ్ ఇన్నింగ్స్‌పై బండ్ల గణేశ్ కామెంట్స్
Bandla Ganesh: యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ, నీరజ కోన దర్శకత్వంలో వచ్చిన ‘తెలుసు కదా’ చిత్రం విజయోత్సవ వేడుక తాజాగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు బండ్ల గణేశ్, ఎస్‌కేఎన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండ్ల గణేశ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
తాను త్వరలోనే సినీ నిర్మాణంలోకి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నట్లు బండ్ల గణేశ్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “నేను నిర్మాణం నుంచి బ్రేక్ తీసుకున్నది ఫ్లాపులు ఇచ్చి కాదు, ‘టెంపర్’ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాను నిర్మించిన తర్వాతే. మళ్లీ త్వరలోనే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడతాను” అని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మీడియా మద్దతుపై మాట్లాడిన బండ్ల గణేశ్, “మీడియా వారు చిన్నచూపు చూస్తే సెలబ్రిటీలకు కూడా భయం వేస్తుంది. సినీ పరిశ్రమలోని వారికి మీడియా ఎప్పుడూ అండగా ఉంటుంది, భవిష్యత్తులోనూ అదే కొనసాగాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
‘తెలుసు కదా’ సినిమా గురించి మాట్లాడుతూ.. సిద్ధు జొన్నలగడ్డ అద్భుతంగా నటించారని బండ్ల గణేశ్ ప్రశంసించారు. “సిద్ధును చూస్తుంటే రవితేజ స్థానంలో మరో యంగ్ హీరో కనిపిస్తున్నట్లు ఉంది. రాబోయే 20 ఏళ్లు ఇండస్ట్రీలో యంగ్ హీరోల హవానే కొనసాగుతుంది. ‘తెలుసు కదా’ వంటి సాహసోపేతమైన చిత్రాన్ని నిర్మించిన విశ్వప్రసాద్‌ను అభినందించాలి. ఆయన మాలాంటి నిర్మాతలందరికీ స్ఫూర్తి. ప్రేమలో ఉన్నవారు, కొత్తగా పెళ్లైన జంటలు ఈ సినిమాను తప్పక చూడాలి” అని సూచించారు.
ఈ వేదికపై మాట్లాడిన సిద్ధు జొన్నలగడ్డ, ‘తెలుసు కదా’ విజయం తనలో ప్రశాంతతను నింపిందని తెలిపారు. “టిల్లు విడుదలైనప్పుడు చాలా భయపడ్డాను. ఆ తర్వాత వచ్చిన జాక్ సినిమాకు బాధపడ్డాను. కానీ, ‘తెలుసు కదా’ విడుదలైన తర్వాత మాత్రం ప్రశాంతంగా ఉన్నాను” అని వెల్లడించారు. ఈ సినిమాను అంగీకరించడానికి ముఖ్య కారణం నటుడు నితిన్ అని, ఆయన వల్లే ఈ ప్రాజెక్ట్‌ను ఓకే చేశానని సిద్ధు తెలిపారు. దర్శకురాలు నీరజ కోనకు, నటి రాశీఖన్నా కష్టానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. “బండ్ల గణేశ్ గారు మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు, ఆయనంత ధైర్యంగా మాట్లాడాలంటే గట్స్ ఉండాలి” అని సిద్ధు పేర్కొన్నారు.
