Bigg Boss 9: రసవత్తరంగా సాగుతున్న బిగ్ బాస్ అగ్నిపరీక్ష..!
Bigg Boss 9: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో, ప్రధాన షో ప్రారంభానికి ముందే ప్రత్యేకమైన ప్రీ-షో ‘బిగ్‌బాస్ అగ్నిపరీక్ష’తో ఈ సీజన్‌కు ఒక సరికొత్త హంగులు అద్దేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు. జియో సినిమా & హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్న ఈ ప్రీ-షో ఇప్పటికే హైప్ క్రియేట్ చేస్తోంది.
ఆగస్ట్ 22, 2025 నుంచి రెండు వారాల పాటు ఈ అగ్నిపరీక్ష ప్రీ-షో ప్రతి రోజు ఒక గంట పాటు ప్రసారం అవుతుంది. ఈ సీజన్‌లో ప్రధాన షోలోకి నేరుగా సెలబ్రిటీలను పంపకుండా, సాధారణ ప్రజల నుంచి ఎంపిక చేయబడిన 45 మంది పోటీపడుతున్నారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు సహా అనేకమంది ఇందులో పాల్గొంటున్నారు. అయితే, ఈ 45 మందిలో కేవలం ఆరుగురు మాత్రమే తమ ప్రతిభతో బిగ్‌బాస్ ఇంట్లోకి ప్రవేశించే అరుదైన అవకాశం దక్కించుకుంటారు. ఇది బిగ్‌బాస్ చరిత్రలోనే ఒక కొత్త ఫార్మాట్ అని చెప్పవచ్చు.
రెండు ఎలిమినేషన్స్ అయిపోయాయా..
ఈ వినూత్న కార్యక్రమానికి ప్రముఖ యాంకర్ శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. న్యాయనిర్ణేతలుగా బిగ్‌బాస్ మాజీ విజేతలు నవదీప్, అభిజీత్, బిందు మాధవి వ్యవహరిస్తున్నారు. ఈ ముగ్గురు మాజీ కంటెస్టెంట్స్ తమ అనుభవం ఆధారంగా నిజమైన టాలెంట్ ఉన్న ఆరుగురిని ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే ఈ ప్రీ-షో షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. రెండు ఎలిమినేషన్లు కూడా పూర్తయినట్లు సమాచారం.
అసలైన షో సెప్టెంబరులో..
సాధారణంగా సెలబ్రిటీలతో నిండి ఉండే ఈ షో, ఈసారి కామన్ పీపుల్‌కు అవకాశం ఇవ్వడం ద్వారా కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడంపై దృష్టి సారించింది. ఈ కొత్త ఫార్మాట్ ద్వారా బిగ్‌బాస్ సీజన్ 9 మరింత డ్రామా, ఎమోషన్స్, వినోదాన్ని అందిస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 అధికారికంగా ప్రారంభం కానుంది. అప్పటివరకు ఈ ‘అగ్నిపరీక్ష’ షోతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని నిర్వాహకులు చూస్తున్నారు.
