Bigg Boss Agnipariksha: క్యాన్సర్ వచ్చిన అమ్మ పక్కన ఉండాల్సింది పోయి.. బిగ్‌బాస్ షోకు వచ్చావా..?
Bigg Boss Agnipariksha: బిగ్‌బాస్ తెలుగు 9వ సీజన్ ప్రారంభం కాకముందే, షో నిర్వాహకులు ఈసారి సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేశారు. ఎప్పటిలా సెలబ్రిటీలతోనే కాకుండా, సామాన్య ప్రజలకూ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ‘బిగ్‌బాస్ అగ్నిపరీక్ష’ పేరుతో ఓ ప్రత్యేక మినీ షోను జియో హాట్‌స్టార్‌లో ప్రారంభించారు. ఆగస్టు 22 నుంచి ప్రసారమవుతున్న ఈ షో, ఇప్పటికే ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచేసింది. దాదాపు 45 మంది సాధారణ ప్రజలు తమ జీవిత గాథలను, కష్టాలను పంచుకుంటూ బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టేందుకు పోటీపడుతున్నారు. ఈ 45 మందిలో ఐదుగురు అత్యంత ప్రతిభావంతులను ఎంపిక చేసి నేరుగా బిగ్‌బాస్ 9వ సీజన్‌లోకి పంపనున్నారు.
ఈ అగ్నిపరీక్షను జడ్జ్ చేసేందుకు నటులు నవదీప్, బిందు మాధవి, అభిజిత్ వ్యవహరిస్తున్నారు. వారి సూచనలు, ప్రశ్నలు, స్పందనలు ఈ షోకు మరింత ఆసక్తిని జోడిస్తున్నాయి. ఈ పోటీలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఎదుర్కొన్న బాధలను, సవాళ్లను పంచుకుంటూ ప్రేక్షకులను ఎమోషనల్ చేస్తున్నారు.
ఒక యువకుడు తన అక్కకు నయం కాని ఎస్ఎల్ఏ అనే వ్యాధి ఉందని చెబుతూ, ఆమె చికిత్స కోసం ఈ షో ద్వారా డబ్బు సంపాదించి తన కుటుంబాన్ని ఆదుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపాడు. మరొక వ్యక్తి తన తండ్రి మరణం తర్వాత కుటుంబానికి తన అమ్మే అండగా నిలిచి రెండు ఉద్యోగాలు చేస్తోందని చెప్పి అందరినీ కదిలించాడు. ఒక యువతి తనపై జరిగిన వేధింపుల గురించి ధైర్యంగా చెప్పి, ఆడవాళ్ళు మానసికంగానే కాదు, శారీరకంగా కూడా బలంగా ఉండాలని నొక్కి చెప్పింది. మరో అమ్మాయి తన తల్లి క్యాన్సర్‌తో మూడోసారి పోరాడుతోందని చెప్పగా, నవదీప్ ఆమెను ఉద్దేశించి, “ఈ సమయంలో మీరు మీ అమ్మ పక్కన ఉండాలి, ఈ షో ముఖ్యమా?” అని ప్రశ్నించడం ఎమోషనల్ మూమెంట్‌గా నిలిచింది.
ఈ విధంగా ప్రతిరోజు అగ్నిపరీక్ష మంచి రసవత్తరంగా సాగుతోంది. ఈ షో ద్వారా ఎంపికైన ఐదుగురు అదృష్టవంతులు నేరుగా సెప్టెంబర్ 7న ప్రారంభం కానున్న బిగ్‌బాస్ 9వ సీజన్‌లోకి అడుగుపెట్టనున్నారు. సామాన్య ప్రజలకు తొలిసారి లభించిన ఈ అద్భుతమైన అవకాశంపై ప్రేక్షకులు కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.
