Bigg Boss Agnipariksha: అగ్నిపరీక్ష.. మరో ప్రోమోతో అంచనాలను పెంచేసిన బిగ్ బాస్..
Bigg Boss Agnipariksha: పాశ్చాత్య దేశాల్లో ‘బిగ్ బ్రదర్’గా మొదలై, ప్రపంచవ్యాప్తంగా అపారమైన అభిమానులను సంపాదించుకున్న రియాలిటీ షో ‘బిగ్ బాస్’. భారతదేశంలో కూడా ఈ కార్యక్రమం అన్ని భాషల్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తెలుగులో కూడా ఈ షోకు స్థిరమైన ఫ్యాన్ బేస్ ఉండటంతో, బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. ఈసారి కూడా అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా మాస్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఎప్పటిలాగే సెలబ్రిటీలతో పాటు, సామాన్యులకు కూడా అవకాశం కల్పించాలనే వ్యూహంతో నిర్వాహకులు ఈసారి ఒక సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
బిగ్ బాస్ చరిత్రలో మొదటిసారిగా ఈ సీజన్‌లో ఏకంగా ఐదుగురు సామాన్యులకు హౌస్‌లోకి వెళ్లే అవకాశం దక్కనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష’ అనే ప్రీ-షోను స్టార్ట్ చేయబోతున్నారు. ఆగస్టు 22 నుంచి ప్రసారం కానున్న ఈ షోలో 40 మంది సామాన్యులు పాల్గొనబోతున్నారు. దేశవ్యాప్తంగా వచ్చిన వేలాది అప్లికేషన్ల నుంచి స్క్రీనింగ్, వీడియో కాల్ ఇంటర్వ్యూల ద్వారా ఈ 40 మందిని ఎంపిక చేశారు. వీరంతా బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్లడానికి కావాల్సిన సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి అనేక టాస్కులను పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఈ కార్యక్రమానికి జడ్జెస్‌గా గత సీజన్లలో ప్రేక్షకులను అలరించిన బిందు మాధవి, నవదీప్, అభిజిత్ వ్యవహరించనుండగా, ప్రముఖ యాంకర్ శ్రీముఖి వ్యాఖ్యాతగా కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ఈ ప్రోమో ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. ప్రోమోలో 40 మంది కంటెస్టెంట్లు విభిన్నమైన పద్ధతుల్లో ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్నారు.
నైట్‌డ్రెస్ వేసుకుని పళ్లు తోముకుంటూ వచ్చిన ఓ అమ్మాయి, స్ట్రాంగ్‌గా మాట్లాడి హౌస్‌కు వార్నింగ్ ఇచ్చిన మహిళ, తనలో ఉన్న టాలెంట్‌ను చూపించిన ఒక హ్యాండీక్యాప్డ్ వ్యక్తి.. ఇలా ప్రతి ఒక్కరూ తమ వైవిధ్యతను ప్రదర్శించారు. ఈ ప్రోమోలో యువ హీరో తేజ సజ్జ కనిపించడం మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ అగ్నిపరీక్ష ద్వారా చివరికి 15 మందిని షార్ట్‌లిస్ట్ చేసి, అందులోంచి 5 మందిని బిగ్ బాస్ హౌస్‌లోకి పంపించనున్నారు. ఈ ఎపిసోడ్‌లు ప్రేక్షకులకు ఎంత వినోదాన్ని పంచుతాయో చూడాలి.