రాష్ట్ర మంత్రి కొడాలి నానీని క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని నిన్న జరిగిన విలేకరుల సమావేసంలో బీజేపీ రాష్ట్ర నాయకులు విష్ణు వర్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. పేరులో కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి పేరు పెట్టుకొని, నుదుటిపై విభూతి ధరించి స్వామీజీ లకు ఏ మాత్రం తీసిపోని వేషధారణతో వుండే కొడాలి, నోరు విప్పితే మాత్రం సభ్యసమాజం తలదించుకునే రీతిలో అసభ్యకరమైన పదజాలం మాట్లాడతారని, అలాంటి వ్యక్తికి రాష్ట్ర క్యాబినెట్ మినిస్టర్ గా ఉండే అర్హత లేదని ఆయన అన్నారు.
తిరుమల ఆలయం ప్రవేశించే అన్యమతస్తులు డిక్లరేషన్ పై ఆయన మాట్లాడిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని ప్రకటించిన తీరు చూస్తుంటే హిందూ సమాజం పై దాడిగా భావించాల్సి వస్తుందని తెలిపారు. కొడాలి చేసే వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతంగా బిజెపి భావించడం లేదని, రాష్ట్రంలో లో పని చేస్తున్న వైసీపీ ప్రభుత్వం వ్యాఖ్యలుగా భావిస్తున్నామని ఆయన తెలిపారు. క్యాబినెట్ మినిస్టర్ గా రాజ్యాంగంపై ప్రమాణం చేసి పదవిలో కూర్చున్న వ్యక్తి బాధ్యతారాహిత్యంగా మతాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీస స్పందన తెలియ చేయకపోవడం మా భావనకు బలం చేకూర్చింది. అంతర్వేది రథం దగ్ధం అయినప్పుడు నిరసన తెలిపిన వారిని పదిరోజులు అరెస్టు చేశారు. కానీ రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి అనాలోచిత వ్యాఖ్యలు చేసిన కొడాలి నానిపై మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇలాంటి బాధ్యత లేని మంత్రులను కేబినెట్ నుండి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.
