బీజేపీ డబ్బుల డ్రామా ఫెయిల్ అయిందని, అందుకే మరో కొత్త డ్రామాకు తెరలేపారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. నిన్న టిఆర్ఎస్ భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ దుబ్బాకలో ప్రజలను మభ్యపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా భారీ ఎత్తున డబ్బు పట్టుబడుతోంది, ఈరోజు కోటి రూపాయలు హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారని అన్నారు. మాపై సామాజిక మాధ్యమాల్లో విస్తృతమైన విషప్రచారాన్ని, అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు, ఇలాంటి వాటన్నింటినీ టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్లు ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నారన్నారు.
బీజేపీ కార్యకర్త ఆత్మహత్య ప్రయత్నాన్ని అవకాశంగా మలుచుకుని, కుటిల ప్రయత్నాలు చేస్తోందనే సమాచారం ఉంది, హైదరాబాదులో డిజిపి కార్యాలయం లేదా ప్రగతి భవన్, తెలంగాణ భవన్ ముట్టడి పేరుతో తమ చివరి కుటిల ప్రయత్నానికి తెరలేపి తద్వారా హైదరాబాద్ లో లాఠీఛార్జ్, లేదా పోలీసు కాల్పులు జరిగేలా బీజేపీ కుట్రలు పన్నుతోంది. ఈ మేరకు బిజెపి పార్టీలోని నాయకులే మాకు సమాచారం అందించారు.
ఇలాంటి సమాచారాన్ని రూడీ చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలని డిజిపిని కోరుతున్నాం, బీజేపీ కుట్రల పట్ల తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎలక్షన్ కమిషనర్ తో పాటు రాష్ట్ర ఎన్నికల అధికారి మరియు రాష్ట్ర డిజిపికి టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల బృందం కలుస్తుంది. నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఏ పార్టీ ప్రయత్నించిన ఉక్కుపాదంతో అణిచివేయాలని రాష్ట్ర డిజిపిని టిఆర్ఎస్ పార్టీ కోరుతుందని కేటీఆర్ తెలిపారు.
ఇంత నీచమైన కుట్రలకు పాల్పడుతున్న బిజెపి అబద్ధాలు, అసత్యాలు డ్రామాలు, డబ్బులు, అవసరమైతే శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ప్రజలు గుర్తించి జాగ్రత్తగా ఉండాలని ఆ మేరకు నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నా, బిజెపి లాంటి కుటిల రాజకీయ పార్టి పట్ల దుబ్బాక ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
