Bombay High Court: శృంగారానికి నిరాకరించే భార్యకు విడాకులు ఇవ్వొచ్చు..!
Bombay High Court: వైవాహిక జీవితంలో భాగస్వామి పట్ల చూపించే నిర్లక్ష్యం, శారీరక సాన్నిహిత్యానికి నిరాకరించడం ‘క్రూరత్వం’ కిందికి వస్తుందని బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భర్తతో శృంగారానికి నిరాకరించడం, వివాహేతర సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తూ మానసికంగా వేధించడం విడాకులకు బలమైన కారణాలుగా ఉంటాయని స్పష్టం చేసింది. ఈ మేరకు పుణె ఫ్యామిలీ కోర్టు మంజూరు చేసిన విడాకులను సవాలు చేస్తూ ఓ భార్య దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
2013లో వివాహం చేసుకున్న ఓ జంట, అదే ఏడాది నుంచి విడివిడిగా ఉంటున్నారు. తన భార్య శృంగారానికి నిరాకరిస్తూ, తనకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని నిరంతరం అనుమానిస్తూ మానసికంగా వేధింపులకు గురిచేస్తోందని భర్త ఆరోపించాడు. అంతేకాకుండా, తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, తోటి ఉద్యోగుల ముందే తనను అవమానిస్తూ మానసిక క్షోభకు గురిచేసిందని ఆయన వాపోయారు. ముఖ్యంగా, దివ్యాంగురాలైన తన సోదరి పట్ల, కుటుంబ సభ్యుల పట్ల ఆమె నిర్లక్ష్యం చూపించడం కూడా తన బాధకు కారణమని భర్త పేర్కొన్నారు. పుట్టింటికి వెళ్ళిన తర్వాత కూడా తనను పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు.
2015లో ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించి..!
ఈ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురైన భర్త, 2015లో పుణెలోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించి విడాకులు మంజూరు చేయాలని కోరాడు. సమగ్ర విచారణ అనంతరం, ఫ్యామిలీ కోర్టు విడాకులకు అనుమతినిస్తూ తీర్పు ఇచ్చింది. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సదరు మహిళ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. తనకు నెలకు లక్ష రూపాయల భరణం చెల్లించాలని కూడా ఈ సందర్భంగా ఆమె విజ్ఞప్తి చేసింది. జస్టిస్ రేవతి మోహితే డెరే మరియు జస్టిస్ నీలా గోఖలేలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది.
స్నేహితుల ముందు భర్తను అవమానించడం..
భార్య ప్రవర్తనను పరిశీలించిన ధర్మాసనం, తోటి ఉద్యోగులు, స్నేహితుల ముందు భర్తను అవమానించడం, అలాగే దివ్యాంగురాలైన భర్త సోదరి పట్ల, అతని కుటుంబీకుల పట్ల చూపిన ఉదాసీనతను ‘క్రూరత్వం’గానే పరిగణించాలని వ్యాఖ్యానించింది. ఈ కారణాలతో ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన విడాకుల తీర్పును సమర్థిస్తూ భార్య పిటిషన్‌ను కొట్టివేసింది. అయితే, అత్తమామలు మాత్రమే తనను వేధించారని, భర్తపై తనకు ప్రేమ ఉందని, విడిపోవడం ఇష్టం లేదని భార్య తన పిటిషన్‌లో పేర్కొనడం గమనార్హం.