Yogi Adityanath: వివాదంలో యోగి ఆదిత్యనాథ్ బయోపిక్..!
Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘అజయ్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఎ యోగి’ (Ajey The Untold Story of a Yogi) చిత్రం ఇప్పుడు సినీ పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించడంతో, చిత్ర నిర్మాతలు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ సినిమా నేడు (ఆగస్టు 1) విడుదల కావాల్సి ఉండగా, సెన్సార్ అడ్డంకుల కారణంగా వాయిదా పడింది.
సెన్సార్ బోర్డు అభ్యంతరాలు..
‘ది మాంక్ హూ బికమ్ చీఫ్ మినిస్టర్’ అనే ప్రసిద్ధ నవల ఆధారంగా రవీంద్ర గౌతమ్ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రానికి రీతూ మెంగి నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో యోగి ఆదిత్యనాథ్ పాత్రను అజయ్ మోహన్ సింగ్ అనే పేరుతో అనంత్ జోషి పోషించారు. ఆయన గురువు మహంత్ పాత్రలో ప్రముఖ నటుడు పరేష్ రావల్ నటించారు. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు సర్టిఫికేట్ నిరాకరించడంపై చిత్ర నిర్మాతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బోర్డు సభ్యులు కేవలం సినిమా ట్రైలర్ చూసి సర్టిఫికేట్‌ను తిరస్కరించారని, పూర్తి చిత్రాన్ని చూడలేదని నిర్మాతల తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు.
కోర్టు ప్రశ్నలు.. సెన్సార్ బోర్డుకు నోటీసులు..
బాంబే హైకోర్టులో ఈ పిటిషన్‌ను స్వీకరించిన న్యాయమూర్తులు రేవతి మోహితే డెరే, నీలా గోఖలేలతో కూడిన ధర్మాసనం సెన్సార్ బోర్డును పలు కీలక ప్రశ్నలు సంధించింది. ఈ సినిమాకు ప్రేరణనిచ్చిన నవల గత ఎనిమిదేళ్లుగా మార్కెట్‌లో ఉన్నా ఎటువంటి అభ్యంతరాలు లేవని, సినిమాకు మాత్రం సర్టిఫికేట్ ఎందుకు తిరస్కరించారని కోర్టు ప్రశ్నించింది. పుస్తకం ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపనప్పుడు, సినిమా మాత్రం ప్రజా శాంతిభద్రతలకు ఎలా భంగం కలిగిస్తుందని న్యాయస్థానం నిలదీసింది. ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని కోరుతూ CBFCకి నోటీసులు జారీ చేసింది.
గత వారం, రెండు రోజుల్లో ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామని సెన్సార్ బోర్డు కోర్టుకు హామీ ఇచ్చింది. అయితే, ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే, ఈ వివాదం ఇప్పట్లో సమసిపోయేలా లేదు. ఈ అంశంపై తదుపరి విచారణ శుక్రవారం జరగనుంది. యోగి ఆదిత్యనాథ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి సెన్సార్ అడ్డంకులు పడటం బాలీవుడ్‌లో కొత్త చర్చకు తెరలేపింది.
