మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కు వరుస కష్టాలు తప్పడం లేదని పార్టీ శ్రేణులు ఆందోళనలో ఉన్నాయి.
రాజధాని వికేంద్రీకరణ పేరుతో ఆయన కలల సౌధాన్ని కూల్చిన వైసీపీ ప్రభుత్వం ఆయనకు ఊపిరి సలపనివ్వకుండా ఎత్తుగడలు వేస్తూనే ఉంది. అమరావతి ఉద్యమానికి ఉత్తరాంధ్ర, రాయలసీమ నుంచి కేడర్ స్పందన లేక ఇటు ప్రజల్లో మద్దతులేక కేవలం న్యాయస్థానాల మీద భారం వేసి కాలం వెళ్లదీస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
ఇప్పుడు చంద్రబాబు పార్టీని, ప్రజలని ఉద్దేశించి ఆయన జూమ్, మరియు ప్రజలతో చేసే ప్రత్యేక లైవ్ ప్రోగ్రామ్స్ కి స్పందన కరువైంది. వీక్షకులు తక్కువగా ఉండడంతో టీవీ ఛానళ్లు కూడా అంతగా శ్రద్ధ చూపించడం లేదు. చంద్రబాబు అమరావతిలో అందుబాటులో ఉండి కేడర్ కి దిశానిర్దేశం చెయ్యాలని ఇటువంటి ప్రయత్నాలు వల్ల ప్రయోజనం ఉండదని పార్టీ సీనియర్లు అభిప్రాయ పడుతున్నారు.
పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు సీనియర్ నాయకులు సైతం కార్యక్రమాలకి అందుబాటులో ఉండటం లేదని
ఇది పార్టీ ప్రతిష్టని దెబ్బతీస్తుందని కార్యకర్తలు భావిస్తున్నారు. లోకేష్ కూడ కొన్ని విధానపరమైన నిర్ణయాలు తప్ప చురుగ్గా ఉండటం లేదని, రాష్ట్రంలో అగ్ర నాయకుల అరెస్టులపై మాత్రమే స్పందిస్తున్నారని, ఇటువంటి ధోరణిలో కొనసాగితే పార్టీ కి ఇబ్బందులు తప్పవని పెదవి విరుస్తున్నారు.
రానున్న రోజుల్లో పార్టీ మనుగడపై ఇటువంటి నిర్ణయాలు తీవ్రమైన ప్రభావం చూపిస్తాయని ఇటు కేడర్ అటు నాయకులు చర్చించుకున్నారు.
