Johnny Master: మైనర్ కేసులో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడంటూ.. జానీ మాస్టర్‌పై చిన్మయి కామెంట్స్
Johnny Master: సినీ పరిశ్రమలో డబ్బింగ్ ఆర్టిస్ట్, సామాజిక కార్యకర్తగా, గాయనిగా సుపరిచితమైన చిన్మయి శ్రీపాద మరోసారి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై సంచలనాత్మక ఆరోపణలు చేశారు. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ తనకున్న సినీ వర్గాల పరిచయాలు, ఇండస్ట్రీలో పలుకుబడిని అడ్డుపెట్టుకుని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చిన్మయి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
తాజాగా సోషల్ మీడియా వేదికగా చిన్మయి సుదీర్ఘ పోస్ట్ చేశారు. ఈ కేసు అత్యంత క్లిష్టమైనదని, కొందరు దీనిని “పరస్పర అంగీకారంతో జరిగింది” అనే కోణంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఒక మేజర్ వ్యక్తి మైనర్ బాలికతో సంబంధం పెట్టుకోవడం కేవలం అతడి బాధ్యతారాహిత్యమే అవుతుందని, బాధితురాలు సహకరించనప్పుడు బెదిరించి లొంగదీసుకోవడం మరింత దారుణమని ఆమె తన పోస్ట్‌లో స్పష్టం చేశారు.
ఈ అంశంపై తాను మాట్లాడిన ప్రతిసారీ జానీ మాస్టర్ సతీమణి ఫోన్ చేసి మాట్లాడవద్దని కోరుతున్నారని చిన్మయి వెల్లడించారు. జానీ మాస్టర్ కుటుంబం తమ వద్ద నిర్దోషిత్వాన్ని నిరూపించే ఆధారాలు ఉన్నాయని చెబుతున్నప్పటికీ, ఇండస్ట్రీలో ఉన్న పరపతిని ఉపయోగించి ఆయన చట్టపరమైన చిక్కుల నుంచి బయటపడాలని చూస్తున్నారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.
ఒకవేళ కోర్టు తీర్పు ఆయనకు అనుకూలంగా వస్తే, ఆయనకు అవార్డులు, సన్మానాలు దక్కుతాయని, ప్రస్తుతం విమర్శిస్తున్న వారే ఆయన ‘నిర్దోషిత్వం’ గురించి గొప్పగా మాట్లాడుతారని చిన్మయి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మైనర్లతో శృంగారాన్ని థ్రిల్‌గా భావించేవారు, ఇలాంటి కేసుల నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా నేర్చుకుంటారని చిన్మయి పదునైన మాటలు అన్నారు.
చివరగా, ఆ బాధితురాలు ధైర్యంగా పోరాడి విజయం సాధించాలని, నిందితుడికి తగిన శిక్ష పడి, ఆమెకు న్యాయం జరగాలని మాత్రమే తాను కోరుకుంటున్నట్లు చిన్మయి పేర్కొన్నారు. చిన్మయి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో పెద్ద దుమారం రేపాయి. అయితే, ఈ ఆరోపణలపై జానీ మాస్టర్ వైపు నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు.
