Avika Gor: పెళ్లి చేసుకోబోతున్న చిన్నారి పెళ్లి కూతురు.. వరుడు ఎవరంటే?
Avika Gor: ‘బాలికా వధు’ (తెలుగులో చిన్నారి పెళ్లి కూతురు) సీరియల్‌తో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించిన నటి అవికా గోర్ తన జీవితంలో ఓ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. ప్రముఖ సామాజిక కార్యకర్త మిలింద్ చంద్వానీతో ఆమె వివాహం సెప్టెంబర్ 30న జరగనుంది. ఈ విషయాన్ని స్వయంగా అవికా గోర్ తన సోషల్ మీడియా ఖాతాలో ధ్రువీకరించడంతో, ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్‌లు పెడుతున్నారు.
చాలా చిన్న వయసులోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అవికా, తెలుగు ప్రేక్షకులకు ‘ఉయ్యాలా జంపాలా’ సినిమాతో కథానాయికగా పరిచయమయ్యారు. తర్వాత సినిమా చూపిస్త మావ, లక్ష‍్మీ రావే మా ఇంటికి, ఎక్కడికి పోతావ్ చిన్నవాడా, రాజుగారి గది 3, థ్యాంక్యూ తదితర తెలుగు మూవీస్ చేసింది, ఈ ఏడాది మార్చిలో విడుదలైన ఆమె చిత్రం షణ్ముఖ ఓటీటీలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. పలు చిత్రాల్లో చేసినప్పటికీ ఆమెకు అనుకున్న స్థాయిలో బ్రేక్ మాత్రం రాలేదు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న అవికా, తన వ్యక్తిగత జీవితంలో కొత్త అడుగులు వేయడానికి సిద్ధమయ్యారు.
అవికా, మిలింద్ చంద్వానీ ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నారు. 2019లో ఒక కార్యక్రమంలో కలుసుకున్న వీరిద్దరి పరిచయం స్నేహంగా మారి, ఆ తర్వాత ప్రేమకు దారితీసింది. 2020లో ఓ రియాలిటీ షోలో తమ ప్రేమ విషయాన్ని బహిరంగంగా ప్రకటించారు. గత జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట, ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు.
ప్రస్తుతం తెలుగులో అవకాశాలు తగ్గిన అవికా, బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పెళ్లి తర్వాత ఆమె సినిమాల్లో కొనసాగుతారా లేదా అన్నది చూడాలి. అయితే ఈ శుభవార్త అవికా అభిమానులను సంతోషంలో ముంచెత్తింది.
అవికా గోర్ జీవిత భాగస్వామి మిలింద్ చంద్వానీ. ఆయన సామాజిక కార్యకర్త, వ్యాపారవేత్త, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎంబీఏ చేసిన ఆయన, క్యాంప్ డైరీస్ అనే ఎన్జీవోను నడుపుతున్నారు. 2019లో ఎంవీటీలో ప్రసారమైన రోడీస్ రియల్ హీరోస్ షోలో పాల్గొన్న మిలింద్, అదే సమయంలో కామన్ ఫ్రెండ్స్ ద్వారా అవికాతో పరిచయం అయ్యారు. ఆ పరిచయం క్రమంగా స్నేహంగా, తరువాత ప్రేమగా మారింది. 2020 నుంచి వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు.