Chiranjeevi Anil Ravipudi: చిరు- అనిల్ రావిపూడి సినిమా పేరు రిలీజ్.. టైటిల్ ఏంటంటే?
Chiranjeevi Anil Ravipudi: మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా 157 సినిమా టైటిల్ నేడు అధికారికంగా ఖరారైంది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘పండగకి వస్తున్నారు’ అనే క్యాప్షన్ ఈ సినిమాపై మరింత అంచనాలను పెంచుతోంది. ఈ మేరకు విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్‌కు ప్రముఖ నటుడు వెంకటేశ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయన స్వరంలో సాగిన ఈ వీడియో సినిమా థీమ్‌ను ఆవిష్కరిస్తూ ఆసక్తిని రేకెత్తించింది.
చిరంజీవి ఒక వింటేజ్ లుక్‌లో కనిపించనున్న ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక కథానాయికగా నటిస్తుండగా, మరో కథానాయికగా త్రిష చిరంజీవి సరసన నటించనున్నారు. వెంకటేశ్ ఇందులో అతిథి పాత్రలో మెరవనున్నారు.
గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, షైన్ స్క్రీన్స్ పతాకాలపై ఈ చిత్రం నిర్మితమవుతోంది. మెగాస్టార్ కుమార్తె కొణిదెల సుష్మిత కూడా నిర్మాతల్లో ఒకరు కావడం విశేషం. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, మూడో షెడ్యూల్ షూటింగ్‌ను చురుగ్గా జరుపుకుంటోంది. ప్రచార చిత్రాలకు సంగీత దర్శకుడు థమన్ అందించిన సంగీతం సినిమాకు మరింత బలాన్ని చేకూర్చింది.
మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు శివ శంకర వరప్రసాద్ కావడంతో, ఆయన నిజ జీవిత పేరుతో ముడిపడిన ఈ టైటిల్‌ను ఎంచుకోవడం ఆయన అభిమానులకు మరింత ప్రత్యేకంగా మారింది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
