Chiranjeevi Birth Day: ‘వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్’.. చిరంజీవికి బర్త్‌డే విషెస్ తెలిసిన సినీ ప్రముఖులు
Chiranjeevi Birth Day: సినీ పరిశ్రమలో తన అసాధారణ ప్రయాణంతో ఎందరికో ఆదర్శంగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవికి 70వ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది. సినీ ప్రముఖులు, అభిమానులు, రాజకీయ నాయకులు తమ అభిమాన నటుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనతో తమకున్న అనుబంధాన్ని పంచుకుంటున్నారు.
1978లో వచ్చిన ‘పునాది రాళ్లు’ చిత్రంతో తన సినీ జీవితాన్ని ప్రారంభించిన చిరంజీవి, ఆ తర్వాత ‘ఖైదీ’, ‘గ్యాంగ్ లీడర్’ వంటి చిత్రాలతో స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నారు. ‘స్వయంకృషి’, ‘రుద్రవీణ’ వంటి కళాత్మక చిత్రాలతో నటుడిగా తన ప్రతిభను చాటుకున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన ఆయన ప్రయాణం కొన్ని తరాలకు స్ఫూర్తినిచ్చింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పద్మవిభూషణ్‌తో సత్కరించడం ఆయన కృషికి, ప్రతిభకు దక్కిన గౌరవం అని చెప్పవచ్చు.
ఈ ప్రత్యేక రోజున పలువురు సినీ తారలు చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు. అల్లు అర్జున్ తన ట్విట్టర్ ఖాతాలో చిరంజీవితో కలిసి ఉన్న డ్యాన్స్ ఫోటోను షేర్ చేస్తూ, “హ్యాపీ బర్త్‌డే.. వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు” అని రాశారు. వెంకటేశ్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఎప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.
మరోవైపు యువ నటుడు సాయి దుర్గా తేజ్ తన మామయ్య చిరంజీవిపై ఉన్న ప్రేమను, గౌరవాన్ని తెలియజేశారు. “నేను చూసిన మొదటి హీరో నా మామయ్యే. ఆయన జీవితం నాకు ఆదర్శం” అని పేర్కొన్నారు. అలాగే, “కష్టమైనా, సుఖమైనా ఆయన తోడుంటే అదే నాకు కొండంత ధైర్యం. మామయ్య మాటే నాకు శాసనం” అని రాసుకొచ్చారు. నారా రోహిత్ ‘విశ్వంభర’ గ్లింప్స్, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు.
యువ నటుడు తేజ సజ్జా “సెన్సేషన్‌కు 70 ఏళ్లు. కాలం గడుస్తున్న కొద్దీ మీపై ప్రేమ పెరుగుతూనే ఉంటుంది” అని అన్నారు. దర్శకుడు హరీష్ శంకర్ “చరిత్రలో చిరస్థాయిగా.. మా గుండెల్లో చిరుస్థాయిగా” అని చిరంజీవిపై తన అభిమానాన్ని చాటుకున్నారు. డైరెక్టర్ బాబీ “భారతీయ సినిమాకు గర్వకారణం, మిలియన్ల మంది హృదయస్పందన మా అన్నయ్య మెగాస్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు” అని తెలిపారు. అలాగే, మంచు మనోజ్, వంశీ పైడిపల్లి వంటి ప్రముఖులు కూడా చిరంజీవికి విషెస్ చెప్పారు.
చిరంజీవి త్వరలో వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది.
