హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అలయ్‌బలయ్ కార్యక్రమం నిర్వహించారు. సినీ నటుడు చిరంజీవి, మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు కూడా ఈ కార్యక్రమానికి వెళ్లారు.
కార్యక్రమంలో గరికపాటి ప్రవచనాలు చెబుతున్న సమయంలో చిరంజీవితో ఫొటోలు దిగేందుకు అక్కడున్న వారు ఆసక్తి చూపారు.అయితే అప్పటికే ప్రవచనం ఆరంభించిన గరికపాటికి ఈ పరిణామం ఇబ్బందిగా అనిపించింది. దీంతో.. అసహనానికి గురైన గరికపాటి అక్కడ మొత్తం ఫొటోల సెషన్ ఆగిపోతే నేను మాట్లాడతాను. లేకపోతే నేను వెళ్లిపోతాను. నాకేం మొహమాటం లేదు. చిరంజీవి గారు దయచేసి మీరు ఆపేసి ఈ పక్కకు రండి. నేను మాట్లాడతాను అని వ్యాఖ్యానించారు.
ఆ వీడియో అటు మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో.. మెగా అభిమానులు చిరంజీవిని గరికపాటి అలా అనడాన్ని తీవ్రంగా తప్పుబడుతూ సోషల్ మీడియాలో గరికపాటి నరసింహారావుపై విరుచుకుపడుతున్నారు. అయితే దీనిపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.
మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన.. గరికపాటి వ్యాఖ్యలపై చర్చించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఆయన పెద్దాయన.. ఆయన చేసిన వ్యాఖ్యలపై చర్చించుకోవాల్సిన అవసరం లేదని సింపుల్ గా తేల్చేసారు.
