Chiranjeevi: ఇదీ చిరంజీవి అంటే.. రియల్ హీరో.. ఏపీ సీఎం చంద్రబాబును కలిసి మరీ..
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన సేవా గుణాన్ని చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం కోసం, అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించేందుకు ఉద్దేశించిన ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆయన రూ. 1 కోటి విరాళం అందజేశారు. ఈ విరాళానికి సంబంధించిన చెక్కును చిరంజీవి స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందజేశారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, “చిరంజీవి గారు ఎల్లప్పుడూ సామాజిక బాధ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ప్రజలకు సేవ చేయాలనే ఆయన తపన, నిబద్ధత నిజంగా ప్రశంసనీయం. ఈ విరాళం ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది” అని అన్నారు.
ఇక చిరంజీవి విరాళం ప్రకటనకు సంబంధిత ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. చిరంజీవి విరాళంపై సామాజిక మాధ్యమాల్లో ప్రశంసల జల్లు కురుస్తోంది. మెగా అభిమానులు “చిరంజీవి రియల్ హీరో” అంటూ ఆయనపై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. గతంలో కూడా చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, అలాగే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తదానం, వైద్య సాయం, నేత్రదానం వంటి ఎన్నో సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆయన అందించిన ఈ విరాళం, మరికొందరికి కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడానికి స్ఫూర్తినిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇటీవల తన 70వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న చిరంజీవి, ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంలో ఆయన నటిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార, కేథరీన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే వరుస హిట్లతో దూసుకుపోతున్నారు అనిల్ రావిపూడి.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా భారీ హిట్ అందుకుంది. ఏకంగా 300 కోట్లు కలెక్షన్స్ కొల్లగొట్టి అందరికీ షాక్ ఇచ్చింది. దాంతో ఈసారి చిరంజీవితో అనిల్ ఏ రేంజ్ హిట్ కొడతారో అని జోరుగా చర్చ నడుస్తోంది. అంతేకాకుండా, ఆయన నటించిన ‘విశ్వంభర’ చిత్రం కూడా వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది.