Chiranjeevi: పెళ్లాం అంటే భయం ఉండాలి.. ఆఖరికి మెగాస్టార్ అయినా సరే..!
Chiranjeevi: యువ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు అనిల్ రావిపూడి, బుచ్చిబాబు సానా, మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సుస్మిత సరదాగా చెప్పిన ఒక సంఘటన అభిమానులను నవ్వుల్లో ముంచెత్తింది. తన తండ్రి చిరంజీవికి తల్లి సురేఖ అంటే చాలా భయమని ఆమె చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని ధృవీకరించడానికి ఇటీవల జరిగిన ఒక సంఘటనను ఆమె వివరించారు. “మా నాన్న ఒక పాట చిత్రీకరణలో ఉన్నప్పుడు, అమ్మ అనుకోకుండా సెట్స్‌కి వచ్చారు. ఆమెను చూసిన వెంటనే నాన్న డ్యాన్స్ స్టెప్పులు కాస్త తడబడ్డాయి. సరిగ్గా డ్యాన్స్ చేయలేకపోయారు. అది చూసి చిత్ర యూనిట్ అంతా నవ్వుకున్నారు. నాన్నపై అమ్మ ప్రభావం ఎంత ఉందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు” అంటూ సుస్మిత చిరునవ్వుతో చెప్పారు.
సుస్మిత చెప్పిన ఈ సంఘటన విన్న ప్రేక్షకులు, అభిమానులు తెగ నవ్వుకున్నారు. ఎంత పెద్ద మెగాస్టార్ అయినా సరే, భార్య ముందు భయపడాల్సిందే అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకరవరప్రసాద్ గారు’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన సరసన నయనతార కథానాయికగా కనిపించనున్నారు. వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు చిరంజీవి నటించిన సోషియో-ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ కూడా వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది.