Chiranjeevi Letter to PK: తమ్ముడు నీ విజయాన్ని చూస్తే గర్వంగా ఉందిరా.. పవన్ కళ్యాణ్‌కు చిరు లేఖ
Chiranjeevi Letter to PK: మెగాస్టార్ చిరంజీవి నేడు తన 70వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే, మెగా అభిమానులకు మరింత సంతోషం కలిగించేలా సోదరుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకరోజు ముందే చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పవన్ ఆప్యాయతకు ముగ్ధుడైన చిరంజీవి, దానికి ప్రతిస్పందనగా ఒక హృదయపూర్వక లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
పవన్ పంపిన పుట్టినరోజు శుభాకాంక్షలు తన హృదయాన్ని తాకాయని చిరంజీవి ఈ లేఖలో పేర్కొన్నారు. “అన్నయ్యగా నన్ను చూసి నువ్వు ఎంతగా గర్విస్తున్నావో, ఒక తమ్ముడిగా నీ విజయం, నీ పట్టుదల, నీ పోరాటం చూసి నేను అంతకంటే ఎక్కువగా ఆస్వాదిస్తున్నాను” అని చిరంజీవి తన ప్రేమను వ్యక్తపరిచారు. నిన్ను నమ్మిన వారికి ఏదైనా చేయాలనే నీ తపనే నీకు కొత్త శక్తిని ఇస్తుంది అని అభినందించారు.
పవన్ కల్యాణ్‌ను ఒక రాజుగా అభివర్ణిస్తూ, “నేడు నీ వెనుక కోట్లాదిమంది జనసైనికులు ఉన్నారు. ఆ సైన్యాన్ని ఓ రాజువై నడిపించు. వారి ఆశలకు, కలలకు కొత్త శక్తినివ్వు. ఓ అన్నయ్యగా నా ఆశీర్వచనాలు ఎప్పుడూ నీతోనే ఉంటాయి. నీ ప్రతీ అడుగులోనూ విజయం నిన్ను వరించాలని ఆ భగవంతుడ్ని కోరుకుంటున్నాను” అని చిరంజీవి లేఖలో పేర్కొన్నారు. ఈ ఎమోషనల్ నోట్ మెగా అభిమానులందరినీ ఆకట్టుకుంది.
మరోవైపు, చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు దేశవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సినీ నిర్మాతలు కూడా మెగా అభిమానులకు సర్ ప్రైజ్ లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రానున్న చిరంజీవి 157వ సినిమా టైటిల్‌ను విడుదల చేశారు. ‘మన శివశంకర వరప్రసాద్ గారు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందుకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను కూడా విడుదల చేశారు. అలాగే, బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న మరో సినిమా అప్డేట్ కూడా సాయంత్రం వెలువడనుంది. ఈరోజు మొత్తం మెగాస్టార్ చిరంజీవి మేనియాతో ప్రేక్షకులు ఉక్కిరిబిక్కిరి అవుతారని చెప్పడంలో సందేహం లేదు.
