Chiranjeevi: చిరంజీవి అభిమానులకు డబుల్ ధమాకా.. దసరాకు మరో కొత్త చిత్రానికి శ్రీకారం
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు దసరా, సంక్రాంతి పండుగలు ముందుగానే వచ్చినట్టే. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘విశ్వంభర’, ‘మన శంకర వరప్రసాద్’ చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వీటితో పాటు, చిరంజీవి- బాబీ (కె.ఎస్.రవీంద్ర) కాంబినేషన్‌లో మరో కొత్త సినిమా ప్రారంభం కానుంది. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు.
దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 2న ఈ కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి-బాబీ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ‘మెగా158’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ భారీ స్థాయిలో నిర్మించనుంది. ఈ సినిమా వచ్చే ఏడాది రెండో సగంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు, చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘మన శంకర వరప్రసాద్’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కేరళలో షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్, ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ కొత్త షెడ్యూల్‌లో రెండు ముఖ్యమైన పాటలతో పాటు, కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో వెంకటేశ్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారని చిత్ర యూనిట్ తెలిపింది. అక్టోబర్ మొదటి వారంలో జరగబోయే షెడ్యూల్‌లో వెంకటేశ్ జాయిన్ కానున్నారు.
ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌లో చిరంజీవి సరసన నయనతార కథానాయికగా నటిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. సంక్రాంతి పండగకు ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు యోచిస్తున్నారు. ఈ రెండు చిత్రాలతో చిరంజీవి అభిమానులను అలరించడం ఖాయం.