Chiranjeevi – Pawan Kalyan : మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా.. అన్నయ్య మీద తనకున్న ప్రేమను కురిపించారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా చిరంజీవి తమను ఎలా పెంచింది, వారికి ఎంత అండదండగా ఉన్నది. ఆయన విజయం వెనుక కృషిని పవన్ కళ్యాణ్ కొనియాడారు. చిరంజీవి యొక్క సున్నిత మనస్తత్వాన్ని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ బయటపెట్టారు. ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు, ఆయన వినయ విధేయతలు తమకు ఆదర్శమని పవన్ కళ్యాణ్ తెలిపారు.
ఈ సందర్భంగా తన ప్రియమైన అన్నయ్యకు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ… అన్నయ్య చిరంజీవి గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ తమ్ముడుగా పుట్టి మిమ్మల్ని అన్నయ్యా అని పిలిచే అదృష్టాన్ని కలిగించిన ఆ భగవంతునికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఒక సన్నని వాగు అలా,అలా ప్రవహిస్తూ మహా నదిగా మారినట్లు మీ పయనం నాకు గోచరిస్తుంటుంది. మీరు ఎదిగి మేము ఎదగడానికి ఒక మార్గం చూపడమే కాక లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచిన మీ సంకల్పం, పట్టుదల, శ్రమ, నీతినిజాయతీ, సేవా భావం నావంటి ఎందరికో ఆదర్శం.
కోట్లాదిమంది అభిమానాన్ని మూటగట్టుకున్నా కించిత్ గర్వం మీలో కనిపించకపోవడానికి మిమ్మల్ని మీరు మలుచుకున్న తీరే కారణం. చెదరని వర్చస్సు, వన్నె తగ్గని మీ అభినయ కౌసల్యంతో సినీ రంగాన అప్రతిహతంగా మీరు సాధిస్తున్న విజయాలు అజరామరమైనవి, ఆనందకరం, ఆరోగ్యకరమైన సంపూర్ణ ఆయుష్షుతో, మీరు మరిన్ని విజయాలు చవిచూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు పవన్ కళ్యాణ్.