Chiranjeevi: 47 ఏళ్ల కెరీర్.. 155 సినిమాలు.. తొలి సినిమా పోస్టర్‌తో మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ కామెంట్
Chiranjeevi: తెలుగు సినిమాకు మెగాస్టార్‌గా మారిన నటుడు చిరంజీవి. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 47 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. తన తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’ సెప్టెంబర్ 22, 1978న విడుదలై నేటితో 47 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిరంజీవి తన సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేసి, తన కెరీర్‌కు పునాది వేసిన ప్రేక్షకులను గుర్తు చేసుకున్నారు.
చిరంజీవి తన పోస్ట్‌లో, “22 సెప్టెంబర్ 1978… కొణిదెల శివశంకర వరప్రసాద్ అనే నేను ‘ప్రాణం ఖరీదు’ చిత్రంతో మీ ముందుకు వచ్చాను. ఈ సినిమా నటుడిగా నాకు ప్రాణం పోసింది” అని పేర్కొన్నారు. ఆయన తనను ‘అన్నయ్య’, ‘కొడుకు’, ‘కుటుంబ సభ్యుడు’గా ఆదరించిన ప్రేక్షకులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు. ఈ 47 ఏళ్లలో తాను అందుకున్న అవార్డులు, గౌరవాలు తనవి కాదని, అభిమానులు ఇచ్చినవి అని చిరంజీవి వినయంగా చెప్పారు. 155 సినిమాలు పూర్తి చేయడానికి కారణం ప్రేక్షకుల నిస్వార్థమైన ప్రేమే అని ఆయన అభిప్రాయపడ్డారు. అభిమానులతో ఈ బంధం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.
‘ప్రాణం ఖరీదు’: చిరంజీవి కెరీర్ ప్రారంభం
చిరంజీవి హీరోగా నటించిన తొలి చిత్రం ‘పునాది రాళ్లు’ అయినప్పటికీ, ముందుగా విడుదలైన చిత్రం ‘ప్రాణం ఖరీదు’. కె. వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి నరసింహ అనే పాత్రలో నటించారు. ఈ సినిమాలో రావు గోపాలరావు, జయసుధ, చంద్రమోహన్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం విడుదలై 47 ఏళ్లు అయిన సందర్భంగా, సోషల్ మీడియాలో సినీ ప్రముఖులు, అభిమానులు చిరంజీవికి శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్‌లు పెడుతున్నారు.
ప్రస్తుతం చిరంజీవి నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. అలాగే, వశిష్ట దర్శకత్వంలో వస్తున్న ‘విశ్వంభర’లో కూడా నటిస్తున్నారు, ఇది 2026 వేసవిలో విడుదల కానుంది. వీటితో పాటు శ్రీకాంత్ ఓదెల, బాబీ దర్శకత్వంలో మరో రెండు సినిమాలు లైన్‌లో ఉన్నాయి