Chiranjeevi Balakrishna: అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి స్పందన.. ఏమన్నారంటే?
Chiranjeevi Balakrishna: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తన పేరు ప్రస్తావించడంపై ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి కీలక ప్రకటన విడుదల చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హయాంలో సినిమా టికెట్ల ధరల పెంపునకు సంబంధించి జరిగిన పరిణామాలపై ఆయన స్పష్టత ఇచ్చారు. ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి ఈ వివరణ ఇచ్చారు.
టీవీలో బాలకృష్ణ వ్యాఖ్యలను ప్రత్యక్షంగా చూసినట్లు చిరంజీవి తన ప్రకటనలో పేర్కొన్నారు. “గత ప్రభుత్వంలో కొందరు నిర్మాతలు నన్ను కలిసి టికెట్ ధరల సమస్యపై ప్రభుత్వంతో మాట్లాడాలని కోరారు. ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి వెళ్లాను. భోజనం చేస్తూనే సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టాలను ఆయనకు వివరించాను. సమయం ఇస్తే అందరితో కలిసి వస్తామని అడిగాను,” అని చిరంజీవి వివరించారు.
కొంతకాలం తర్వాత అప్పటి మంత్రి పేర్ని నాని నుంచి ఫోన్ వచ్చిందని, కోవిడ్ నిబంధనల కారణంగా కేవలం ఐదుగురు మాత్రమే రావాలని చెప్పారని చిరంజీవి తెలిపారు. బాలకృష్ణను కలిసేందుకు ప్రయత్నించినా ఆయన అందుబాటులో లేరని పేర్కొన్నారు. “ఒక విమానం ఏర్పాటు చేసి, ఆర్. నారాయణమూర్తితో సహా మరికొంతమందితో కలిసి వెళ్లి ముఖ్యమంత్రిని కలిశాం. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ముఖ్యంగా టికెట్ ధరల సమస్యపై చర్చించాం. అప్పుడు అక్కడ ఉన్న వారందరూ దీనికి సాక్ష్యం,” అని చిరంజీవి స్పష్టం చేశారు.
ప్రభుత్వ నిర్ణయం వల్ల సినీ పరిశ్రమకు మేలు జరిగిందని చిరంజీవి అన్నారు. తన చొరవతోనే టికెట్ల ధరల పెంపునకు ప్రభుత్వం అంగీకరించిందని, ఆ నిర్ణయం వల్ల ‘వీరసింహా రెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ వంటి చిత్రాలకు పెరిగిన టికెట్ ధరలతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు లాభాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. “ముఖ్యమంత్రితోనైనా, సామాన్యుడితోనైనా సహజంగా, పరస్పర గౌరవంతోనే మాట్లాడుతాను. నేను గట్టిగా మాట్లాడితే వైఎస్ జగన్ దిగివచ్చారన్నది అంతా అబద్ధం. ఈరోజు అసెంబ్లీలో నా పేరు ప్రస్తావన వచ్చింది కాబట్టే వివరణ ఇస్తున్నా” అని చిరంజీవి తన ప్రకటనలో చెప్పుకొచ్చారు.
అసెంబ్లీలో జరిగిన చర్చలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ, “ఇండస్ట్రీ మొత్తం సీఎం జగన్‌ని కలవడానికి వచ్చినప్పుడు, ఆయన మొదట అందుబాటులోకి రాకుండా మంత్రిని కలవమన్నారు. చిరంజీవి గారు గట్టిగా అడిగిన తర్వాతే సీఎం జగన్ వచ్చారు,” అని చెప్పారు. దీనిపై బాలకృష్ణ స్పందిస్తూ, “చిరంజీవి గారు గట్టిగా అడిగినందువల్ల జగన్ దిగి వచ్చారనేది అబద్ధం. అవమానం జరిగింది మాత్రం నిజం.” అని వ్యాఖ్యానించారు.
