Chiranjeevi Venkatesh: మెగాస్టార్ – విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ కి పూనకాలు.. ‘మన శంకరవరప్రసాద్‌గారు’లో మాస్ డ్యాన్స్
Chiranjeevi Venkatesh: తెలుగు సినీ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న మెగా కాంబినేషన్‌కు తెరలేపిన చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’. అగ్ర కథానాయకులు మెగాస్టార్ చిరంజీవి మరియు విక్టరీ వెంకటేశ్ కలిసి నటిస్తున్న ఈ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌ను ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా సిద్ధమవుతోంది.
ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార కథానాయికగా నటిస్తుండగా, వీటీవీ గణేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే తుది దశకు చేరుకున్న ఈ సినిమా నుంచి తాజాగా ఒక అద్భుతమైన అప్డేట్ వచ్చింది. చిరంజీవి, వెంకటేశ్‌పై చిత్రీకరించే మాస్ డ్యాన్స్ నంబర్ షూటింగ్‌ను చిత్రబృందం ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభించినట్లు అధికారికంగా ప్రకటించింది.
హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్‌లో దాదాపు 500 మంది డ్యాన్సర్ల మధ్య ఈ మాస్ గీతం చిత్రీకరణ జరుగుతోంది. ఈ పాట ఈ చిత్రానికే ప్రధాన ఆకర్షణగా నిలవనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఇద్దరు దిగ్గజ నటుల కెమిస్ట్రీ, వారు వేసే హుషారైన స్టెప్పులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ మాస్ సాంగ్‌కు భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చారు.
వినోదం, యాక్షన్ అంశాలతో కుటుంబ ప్రేక్షకులను అలరించే విధంగా అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం నుంచి చిరంజీవి, నయనతారపై చిత్రీకరించిన మెలోడీ పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ కాంబోలో సినిమా రావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
