Chiranjeevi: జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీతలు వీళ్లే.. చిరంజీవి రియాక్షన్ ఏంటంటే?
Chiranjeevi: తాజాగా ప్రకటించిన 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమా సత్తా చాటింది. పదికి పైగా విభాగాల్లో అవార్డులను కైవసం చేసుకుంది. ఈ విజయం పట్ల సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు ప్రముఖులు విజేతలకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.
ఈసారి జాతీయ అవార్డుల్లో తెలుగు చిత్రాలు ఏడు ప్రధాన విభాగాల్లో పురస్కారాలు పొందగా, తెలుగు నటీనటులు, సాంకేతిక నిపుణులు ఇతర భాషా చిత్రాలకు చేసిన కృషి కూడా గుర్తింపు పొందింది. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘భగవంత్ కేసరి’ చిత్రం ‘ఉత్తమ ప్రాంతీయ తెలుగు చలనచిత్రం’ పురస్కారాన్ని గెలుచుకుంది. ప్రశాంత్ వర్మ రూపొందించిన మైథలాజికల్ సోషియో ఫాంటసీ చిత్రం ‘హనుమాన్’ రెండు అవార్డులను సొంతం చేసుకుంది – ‘ఉత్తమ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్’ విభాగంలో ఉత్తమ చిత్రంగా నిలవగా, ఈ చిత్రానికి నందు, పృథ్వీలకు ‘ఉత్తమ యాక్షన్ డైరెక్షన్’ అవార్డు దక్కింది.
యువతను విశేషంగా ఆకట్టుకున్న ‘బేబీ’ చిత్రానికి రెండు అవార్డులు లభించాయి. దర్శకుడు సాయి రాజేష్ ‘ఉత్తమ స్క్రీన్‌ప్లే’ అవార్డును అందుకోగా, ‘ప్రేమిస్తున్నా’ పాటకు పి.వి.ఎన్.ఎస్. రోహిత్ ‘ఉత్తమ నేపథ్య గాయకుడు’ పురస్కారం అందుకున్నారు. ‘గాంధీతాత చెట్టు’ చిత్రంలో తన నటనకు గాను సుకృతి బండి రెడ్డి ‘ఉత్తమ బాలనటి’గా ఎంపికయ్యారు. అలాగే, ‘బలగం’ చిత్రంలోని ‘ఊరు పల్లెటూరు’ పాటకు ఉత్తమ గేయ రచయితగా కాసర్ల శ్యామ్ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. తెలుగు టాలెంట్‌తో రూపొందిన ‘యానిమల్’ (హర్షవర్ధన్ రామేశ్వర్ – ఉత్తమ సంగీత దర్శకులు), ‘వాథీ’ (జి.వి. ప్రకాష్ కుమార్ – ఉత్తమ సంగీత దర్శకులు) వంటి చిత్రాలకూ అవార్డులు దక్కడం గర్వకారణం.
మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ, “తెలుగు టాలెంట్, తెలుగు సినిమాలు ఈసారి పదికి పైగా విభాగాల్లో అవార్డులు గెలుచుకోవడం చూసి ఎంతో గర్వంగా ఉంది” అని ఆనందం వ్యక్తం చేశారు. ‘భగవంత్ కేసరి’ చిత్ర బృందానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ, అవార్డులు గెలుచుకున్న వారందరి పేర్లను తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
