Vishwambhara: మెగాస్టార్-మౌనిరాయ్ స్పెషల్ సాంగ్‌తో ‘విశ్వంభర’ షూటింగ్ పూర్తి
Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా రూపొందుతున్న భారీ బడ్జెట్ సోషియో-ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ చిత్రీకరణ విజయవంతంగా పూర్తయింది. శుక్రవారం హైదరాబాద్‌లో చిరంజీవి, బాలీవుడ్ బ్యూటీ మౌనిరాయ్‌లపై చిత్రీకరించిన స్పెషల్ సాంగ్‌తో సినిమా షూటింగ్ పూర్తి అయినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఈ ప్రకటన మెగా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది.
యువ దర్శకుడు వశిష్ఠ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై మొదటి నుంచీ భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవి గతంలో ఎన్నడూ చూడని పాత్రలో కనిపించనున్నారని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష, కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ విలన్ పాత్రలో కనిపించనుండగా, సురభి, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి వంటి ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషించారు.
యు.వి. క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సినిమా టాకీ భాగం చిత్రీకరణ ఇదివరకే పూర్తయింది. తాజాగా చిత్రీకరించిన ప్రత్యేక గీతం ఈ సినిమాకే హైలైట్ కానుందని తెలుస్తోంది. ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య ఈ పాటను తెరకెక్కించారు. ఈ పాటలో చిరంజీవి, మౌనిరాయ్‌తో పాటు వంద మందికిపైగా డ్యాన్సర్లు పాల్గొన్నారు. యువ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో ఈ హై-ఎనర్జీ మాస్ సాంగ్‌ను స్వరపరచగా, శ్యామ్ కాసర్ల సాహిత్యం అందించారు. ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్యవహరించారు.
‘విశ్వంభర’లో మౌని రాయ్ ప్రత్యేక గీతంలో కనిపించడం ఆమె టాలీవుడ్ ఎంట్రీగా చెప్పవచ్చు. చిరంజీవితో కలిసి స్క్రీన్‌ను పంచుకోవడంపై మౌనిరాయ్ కూడా సంతోషం వ్యక్తం చేశారు. షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో, త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరించిన ఈ సోషియో-ఫాంటసీ చిత్రం ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని అందిస్తుందని చిత్ర నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.