Chiru Venky: చిరంజీవి, వెంకటేశ్ మాస్ మేనియా.. ‘మన శంకర వర ప్రసాద్‌గారు’.. సాంగ్ గ్లింప్స్ వైరల్
Chiru Venky: మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకర వర ప్రసాద్‌గారు’ అంచనాలను భారీగా పెంచుతోంది. ‘పండగకు వస్తున్నారు’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ మాస్ ఎంటర్‌టైనర్‌కు స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తుండగా, విక్టరీ వెంకటేశ్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే.
చిరంజీవి, వెంకటేశ్‌ల మాస్ కాంబినేషన్‌లో ఒక ప్రత్యేక పాట ఉండబోతుందనే వార్త ఫ్యాన్స్‌లో ఇప్పటికే ఉత్సాహాన్ని నింపింది. తాజాగా ఈ అంచనాలను మరింత పెంచుతూ మేకర్స్ ఆ ‘మెగా విక్టరీ మాస్ సాంగ్’ గ్లింప్స్‌ను విడుదల చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ గ్లింప్స్‌లో బ్యాక్ డ్రాప్ విజువల్స్ అద్భుతంగా ఉండగా, చిరంజీవి, వెంకటేశ్‌లు ఇద్దరూ కలిసి మాస్ స్టైల్‌లో నడుస్తూ ‘థంబ్స్ అప్’ సింబల్ చూపించడం అభిమానుల్లో జోష్ నింపింది. “మెగా విక్టరీ మాస్ సాంగ్.. షూటింగ్ కొనసాగుతోంది” అంటూ అనిల్ రావిపూడి టీమ్ ఈ గ్లింప్స్‌ను షేర్ చేసింది. ఇది ఇంట్రోగా మాత్రమే ఉన్నప్పటికీ, ఈ పాటపై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘మీసాల పిల్ల’ సాంగ్ మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధిస్తూ ట్రెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో, చిరంజీవి-వెంకటేశ్ కాంబోలోని ఈ మాస్ సాంగ్ ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.
ఈ చిత్రంలో వీటీవీ గణేశ్, కేథరిన్ థ్రెసా, హర్షవర్దన్, అలాగే ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫేం రేవంత్ భీమల (బుల్లిరాజు) కీలక పాత్రలు పోషిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ (సుస్మిత కొణిదెల-విష్ణు ప్రసాద్ హోం బ్యానర్) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఈ భారీ చిత్రం 2026 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. అయితే, కచ్చితమైన విడుదల తేదీపై మేకర్స్ నుంచి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
