రాష్ట్రంలో కోవిడ్–19 (కరోనా వైరస్) నివారణ చర్యలపై సిఎం క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ రెడ్డి సమీక్ష జరిపారు. సమావేశంలో జగన్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న అన్ని ఆస్పత్రుల్లో అత్యంత నాణ్యతతో కూడిన వైద్య సేవలందాలి. దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆరోగ్యశ్రీ ఉన్న అన్ని ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. అలాగే ఆస్పత్రుల్లో ఆరోగ్యమిత్ర (హెల్ప్‌డెస్క్)ను నియమించారా లేదా? వారు ఎలా పని చేస్తున్నారో ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలిస్తూ ఉండాలి. పేషెంట్ ఆస్పత్రికి రాగానే ఆరోగ్యమిత్ర సిబ్బంది వారి సమస్య తెలుసుకోవాలి. ఆసుపత్రిలో ఎక్కడికి వెళ్లాలో దగ్గరుండి సూచించాలి. ఆరోగ్యమిత్ర సిబ్బంది తప్పనిసరిగా ప్రొటోకాల్ ప్రకారం పని చేయాలి. ఒకవేళ ఆస్పత్రిలో పేషెంట్ చికిత్సకి సంబంధించి తగిన వైద్య సదుపాయాలు లభించకపోతే, సమీపంలోని ఏ ఆస్పత్రిలో ఆ సదుపాయాలు ఉన్నాయో తెలుసుకుని ఆరోగ్యమిత్ర వారే అక్కడి వారితో మాట్లాడాలి అలాగే వైద్యులతో కూడా మాట్లాడాలి. సమీపంలో ఆసుపత్రికి ఆ రోగిని అక్కడికి వారే స్వయంగా పంపించాలి. పేషెంట్ కి అవసరమైన నాణ్యమైన వైద్యం అందడమే మనకి చాలా ముఖ్యం. అదే మనం ఆరోగ్యశ్రీ పథకం నుంచి ఆశిస్తున్నాం. ఆరోగ్యమిత్రల పని ఆ విధంగా ఉండాలని కోరుతున్నాం. అని జగన్ స్పష్టం చేసారు.
అలాగే ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, నిత్యం వైద్యుల అందుబాటు, అత్యవసర సమయాల్లో డాక్టర్ లు అందుబాటులొ ఉండటం, ప్రమాణాలతో కూడిన మందులు, ఆహారం, శానిటేషన్, ఆరోగ్యమిత్ర (హెల్ప్‌డెస్క్). ఈ ప్రమాణాలు అన్ని ఆస్పత్రుల్లో ఉండాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు అన్నింటిలో ఈ ప్రమాణాలు ఉండి తీరాలని సంబంధిత అధికారులని జగన్ రెడ్డి ఆదేశించారు. అదే విధంగా కోవిడ్ ఆస్పత్రుల్లో కూడా క్వాలిటీ వైద్యం, వైద్య సదుపాయాలు, మంచి ఆహారం, శానిటేషన్ తప్పనిసరిగా ఉండాలని చెప్పారు.
