Complaint to ACB on Corruption of Kaleswaram Project : తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఇంకా పాత ప్రభుత్వం చేసినటువంటి అవినీతిని బయటపెట్టే పనిలోనే తన మొదటి అడుగు వేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి, అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న కాలేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని మొదటి నుండి కూడా రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు.
ఆ ప్రాజెక్టు పై భారీగా అంచనాలు పెంచి దాని మూలంగా బి ఆర్ ఎస్ ప్రభుత్వ పెద్దలు, అలాగే కాంట్రాక్టర్లు లబ్ధి పొందారని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి విమర్శ చేశారు. ఇక అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే కాలేశ్వరం ప్రాజెక్టు అవినీతిని బయటపెట్టే పనిలో పడ్డారు రేవంత్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాలేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడినటువంటి ప్రతి ఒక్కరిని విచారణ చేపట్టి జైలుకు పంపిస్తామని రేవంత్ ముందే తెలిపారు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఆచరణ కూడా మొదలుపెట్టారు.

కాలేశ్వరం ప్రాజెక్టు పై విచారణ చేపట్టాలని తెలంగాణ ఏసీబికి ఫిర్యాదు అందింది. హైదరాబాదుకు చెందిన రాపోలు భాస్కర్ అనే న్యాయవాది దీనిపై ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ తో సహా హరీష్ రావు, కవిత, మెగా కృష్ణారెడ్డి, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లు పై కేసు నమోదు చేయాలని వినతి పత్రాన్ని ఎసిబికి అందజేశారు.
ఈ ప్రాజెక్టు ద్వారా వేల కోట్ల రూపాయలు దోపిడీ జరిగిందని పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా సాగు, తాగునీటి ప్రాజెక్టు పేరుతో అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని రాపోలు భాస్కర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏసీబీ దీనిపైన సమగ్ర విచారణ చేపట్టాలి, అవినీతికి కారకులైన వారిని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాపోలు భాస్కర్ డిమాండ్ చేస్తున్నారు.
ఫిర్యాదు అందిన వెంటనే ఏసీబీ అధికారులు కేసును నమోదు చేసుకోవడం ఇప్పుడు సంచలన వ్యవహారంగా మారింది. ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని భారీగా పెంచుతూ నిర్ణయాలు తీసుకోవడం, ఆ నెపంతో దాని వెనుక భారీగా సొమ్ములు చేతులు మారినట్లు ఆరోపణలు ఉండడంతో, ఇప్పుడు దీనిపై బిఆర్ఎస్ నేతల్లో టెన్షన్ మొదలైంది.
