Coolie: నాది చాలా నెగెటివ్ రోల్.. దాని గురించి నా మనవళ్లకు అస్సలే చెప్పను: నాగార్జున
Coolie: లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ‘కూలీ’ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాలో నాగార్జున, శృతి హాసన్, అమీర్ ఖాన్, పూజా హెగ్డే వంటి అగ్ర నటీనటులు భాగం కావడం విశేషం. తాజాగా వీరు తమ పాత్రల గురించి, సినిమా అనుభవాల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
వారికి అస్సలే చెప్పను : నాగార్జున
‘కుబేర’ సినిమా విజయంతో దూసుకెళ్తున్న అగ్ర కథానాయకుడు నాగార్జున, ‘కూలీ’లో ‘సైమన్’ అనే నెగెటివ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర గురించి మాట్లాడుతూ, “ఇది నా మనవళ్లకు చెప్పడానికి ఇష్టం లేని పాత్ర. ఎందుకంటే ఇది చాలా నెగెటివ్‌గా ఉంటుంది,” అని చమత్కరించారు. రజనీకాంత్‌తో పనిచేయడం అద్భుతమైన అనుభవమని, సెట్‌లో ఆయన ఉన్నప్పుడు సందడి వేరుగా ఉంటుందని ప్రశంసించారు.
నిజ జీవితానికి భిన్నమైన పాత్ర : శృతి హాసన్
ఈ సినిమాలో ‘ప్రీతి’ అనే పాత్ర పోషించిన శృతి హాసన్ మాట్లాడుతూ, “ప్రీతి నా లాంటి అమ్మాయి కాదు, కానీ ఆమెలోని కొన్ని అంశాలకు నేను కనెక్ట్ అయ్యాను,” అని చెప్పారు.
స్క్రిప్ట్ వినకుండానే ఓకే చెప్పేశా : అమీర్ ఖాన్
‘కూలీ’ సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్న అమీర్ ఖాన్, ఈ సినిమాకు ఎందుకు అంగీకరించారో వివరించారు. “లోకేశ్ నన్ను కలవడానికి వచ్చారని నాకు తెలియదు. రజనీకాంత్ సినిమా అని తెలియగానే, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పాను. నా కెరీర్‌లో స్క్రిప్ట్ వినకుండా ఓకే చెప్పడం ఇదే మొదటిసారి” అని చెప్పారు.
‘మోనికా’ పాట షూటింగ్‌లోనే తెలిసింది : పూజా హెగ్డే
‘కూలీ’లో ‘మోనికా’ పాటలో నటించిన పూజా హెగ్డే, ఆ పాట బ్లాక్‌బస్టర్ అవుతుందని ముందే అర్థమైందని చెప్పారు. “సూర్య రెట్రోలో ‘కనిమా’ పాట ఎంత వైరల్ అవుతుందో విడుదలయ్యే వరకు నాకు తెలియదు. కానీ, ‘కూలీ’లో ఈ పాట చిత్రీకరణలోనే ఇది ప్రేక్షకులకు నచ్చుతుందని, బ్లాక్‌బస్టర్ అవుతుందని అర్థమైంది” అని ఆమె వెల్లడించారు.