యుఎస్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న కొద్దీ, అమెరికాలో ట్రంప్-అనుకూల మరియు ట్రంప్ వ్యతిరేక వర్గాలు రోడ్లపైకి వచ్చి అనేక రకాలుగా నిరసనలను తెలుపుతున్నారు.
ఈ నేపథ్యంలో మాన్హాటన్ పోలీసులు దాదాపు 60 మందిని అరెస్టు చేశారు. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల ప్రకారం, మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ 264 ఎలక్ట్రోరల్ ఓట్లను సాధించి, తదుపరి అధ్యక్షుడిగా ఆయనకున్న అవకాశాలను మెరుగుపర్చుకున్నారు. అధ్యక్షుడుగా ప్రమాణం చేయటానికి 270 ఎలక్ట్రోరల్ ఓట్లు కావాలి. ఇందుకు ఆయన ఇంకా ఫలితాలు వెలువడాల్సి రాష్ట్రాలనుండి ఏదో ఒక రాష్టంలో విజయం సాధిస్తే సరిపోతుంది.
మరోవైపు, ఫలితాల్లో వెనుకబడి ఉన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పెన్సిల్వేనియా, మిచిగాన్ మరియు జార్జియా రాష్ట్రాల ఫలితాలపై సుప్రీంకోర్టులో దావా వేశారు. అంతేకాదు ఓట్ల లెక్కింపును ఆపివేయాలన్నారు. ఇందుకు ప్రతిస్పందనగా, బిడెన్ మద్దతుదారులు “ప్రతి ఓటును లెక్కించమని” నినాదాలు చేస్తూ అనేక అమెరికన్ నగరాల వీధుల గుండా మార్చింగ్ చేస్తున్నారు.
మిన్నియాపాలిస్లో నిరసనకారులు ఫ్రీవేను అడ్డుకున్నారు. చాలామంది అరెస్టు అయ్యారు. పోర్ట్‌ల్యాండ్‌లో, వందలాది మంది గుమిగూడి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కొన్నిచోట్ల అయితే షాపుల అద్దాలు పగులగొట్టారు. ఫీనిక్స్లో, ట్రంప్ అనుకూల నిరసనకారుల వద్ద ఆయుధాలు కూడా ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా రెండవసారి అధ్యక్షుడుగా ప్రమాణం చేయాలని కలలు కన్న ట్రంప్ ఆశ నెరవేరేట్లు లేదు.