టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఢిల్లీ నుంచి రూర్కీ వెళ్తుండగా.. పంత్ ప్రయాణిస్తున్న కారు రైలింగ్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. పంత్‌కు కాలు, నుదిటి, వీపుపై ఎక్కువ గాయాలయ్యాయి. కారులో మంటలు చెలరేగడానికి ముందే పంత్ కారు నుంచి దూకేసినట్లు తెలిసింది.
మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైంది. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం పంత్‌ను ఆస్పత్రికి తరలించారు. ఆయనను ఢిల్లీ రోడ్డులోని సక్షమ్ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం పంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
బంగ్లాదేశ్‌తో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్‌లో పంత్ ఆడిన విషయం తెలిసిందే. జనవరిలో జరగబోయే శ్రీలంకతో సిరీస్‌కు పంత్‌ను సెలక్షన్ టీమ్ ఎంపిక చేయలేదు. మాజీ కెప్టెన్ ధోనీతో కలిసి రిషబ్ పంత్ దుబాయ్‌లో క్రిస్మస్ వేడుకలను జరుపుకున్న విషయం తెలిసిందే.