Dulquer Prithviraj: లగ్జరీ కార్ల స్మగ్లింగ్ కేసులో దుల్కర్, పృథ్వీరాజ్ ఇళ్లలో కస్టమ్స్ అధికారుల సోదాలు
Dulquer Prithviraj: విదేశాల నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్న విలాసవంతమైన కార్ల కేసులో మలయాళ స్టార్ నటులైన దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇళ్లపై కస్టమ్స్ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ‘ఆపరేషన్ నమకూర్’ పేరుతో దేశవ్యాప్తంగా లగ్జరీ కార్ల స్మగ్లింగ్‌పై కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా ఈ దాడులు జరిగాయి. కోచి, తిరువనంతపురంలో ఉన్న పృథ్వీరాజ్ నివాసాలతో పాటు, పనంపిల్లి నగర్‌లోని దుల్కర్ సల్మాన్ ఇంటిలోనూ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. అయితే, ఈ సోదాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి లగ్జరీ కార్లు లభించలేదని కస్టమ్స్ వర్గాలు తెలిపినట్లు సమాచారం.
సాధారణంగా, విదేశాల నుంచి అత్యంత ఖరీదైన వస్తువులు, విలాసవంతమైన కార్లను దిగుమతి చేసుకుంటే భారీ మొత్తంలో పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పన్నులను తప్పించుకోవడానికి కొందరు ఏజెంట్లు అక్రమ మార్గాలను అనుసరిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ట్రేడ్ నిబంధనలలోని లొసుగులను ఉపయోగించుకుని, తప్పుడు పత్రాలు సృష్టించి, విదేశీ కార్లను దేశంలోకి తీసుకువస్తున్నారని దర్యాప్తులో తేలింది. ముఖ్యంగా, భూటాన్ రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాలను హిమాచల్‌ప్రదేశ్‌లోకి అక్రమంగా తరలించి, వాటిని భారత్‌లో రిజిస్టర్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ స్మగ్లింగ్ దందాలో స్థానిక అధికారులు కూడా భాగస్వాములైనట్లు కస్టమ్స్ అనుమానిస్తున్నారు.
కొన్నేళ్లుగా జరుగుతున్న ఈ భారీ స్మగ్లింగ్ రాకెట్‌పై కస్టమ్స్ అధికారులు మరింత లోతుగా దృష్టి సారించారు. ఈ కేసులో కేవలం ఈ ఇద్దరు నటుల ఇళ్లే కాకుండా, కొచ్చి, కోజికోడ్, మలప్పురంతో సహా కేరళ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లోనూ ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల వెనుక మరికొంత మంది ప్రముఖుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ సోదాలతో, సినీ ప్రముఖులు, సంపన్నులు విదేశీ లగ్జరీ కార్లను దిగుమతి చేసుకునే విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని కస్టమ్స్ అధికారులు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసినట్లు కనిపిస్తోంది.
విదేశాల నుంచి అనేక విలాసవంతమైన, ఖరీదైన వస్తువులు స్మగ్లింగ్ చేయడం కొత్తేమీ కాదు. అత్యంత లాభదాయకమైన వ్యవహారం కూడా. పెట్టిన పెట్టుబడికి డబుల్ ఖాయం. రిస్క్ కూడా అంతే ఉంటుంది. పట్టుబడితే, శిక్షలు కఠినంగా ఉంటాయి. ఇటీవల భూటాన్ ఆర్మీ పక్కన పెట్టిన ఖరీదైన కార్లను అక్కడ రూ.లక్షకు కొనుగోలు చేసి ఇక్కడ రూ.10లక్షలకు అమ్ముతున్నారు. ఇక ఎస్‌యూవీ అయితే, రూ.3 లక్షలు కొని రూ.30 లక్షలకు అమ్ముతున్నట్లు గుర్తించారు.
