Supergirl: డీసీ అభిమానులకు గుడ్ న్యూస్.. 2026లో రాబోతున్న ‘సూపర్ గర్ల్’ టీజర్ విడుదల
Supergirl: ప్రపంచవ్యాప్తంగా సూపర్ హీరోల సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా, డీసీ స్టూడియోస్, వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ నుంచి మరో అద్భుతమైన సూపర్ హీరో చిత్రం రాబోతోంది. ఆ సినిమానే ‘సూపర్ గర్ల్’.
ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో, సూపర్‌మ్యాన్ కజిన్ అయిన ‘కారా జోర్-ఎల్’ అలియాస్ సూపర్ గర్ల్ పాత్రను ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ సిరీస్ ఫేమ్ నటి మిల్లీ ఆల్కాక్ పోషించబోతున్నారు. ఇప్పటికే ఆమె లుక్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతూ, చిత్ర యూనిట్ తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా సినిమా కథా నేపథ్యం గురించి మరిన్ని వివరాలు వెల్లడయ్యాయి.
ఈ సినిమా ‘సూపర్‌మ్యాన్: ఉమెన్ ఆఫ్ టుమారో’ అనే ప్రసిద్ధ కామిక్ పుస్తకం ఆధారంగా రూపొందుతోంది. కథలో, కారా జోర్-ఎల్ పాత్ర 20 ఏళ్ల యువతిగా కనిపిస్తుంది. ఆమెకు అపారమైన సూపర్ గర్ల్ శక్తులు ఉన్నప్పటికీ, వాటిని ఎలా ఉపయోగించాలో, వాటిని ఎలా నియంత్రించాలో సరిగ్గా తెలియని స్థితిలో ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో దేశం పెద్ద ప్రమాదంలో పడినప్పుడు, కారా జోర్-ఎల్ తన శక్తిని గుర్తించి, ఆ సమస్యను ఎలా ఎదుర్కొంది? అనేది ఈ సినిమా ముఖ్య కథాంశం. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు క్రెయిగ్ గిల్లెస్పీ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సూపర్ హీరో సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 26, 2026 న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు ఇతర ప్రాంతీయ భాషల్లోనూ ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. మిల్లీ ఆల్కాక్ నటన డీసీ స్టూడియోస్ విజువల్స్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
