Deeksha Panth: ఆఫర్ ఇస్తే పడుకుంటాం తప్పేంటి?.. క్యాస్టింగ్ కౌచ్‌పై దీక్షా పంత్ సంచలన వ్యాఖ్యలు
Deeksha Panth: సినీ పరిశ్రమలో అవకాశాల కోసం వచ్చే అమ్మాయిలను వేధించే క్యాస్టింగ్ కౌచ్ సమస్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఎంతోమంది నటీమణులు తమ కెరీర్లో ఎదుర్కొన్న చేదు అనుభవాలను బయటపెడుతున్నారు. తాజాగా, టాలీవుడ్ నటి దీక్షా పంత్ క్యాస్టింగ్ కౌచ్ గురించి చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. దాదాపు ఎనిమిదేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న దీక్షా, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్, బిగ్‌బాస్ ప్రయాణం, క్యాస్టింగ్ కౌచ్‌పై మాట్లాడారు.
ఆమె సినీ ప్రస్థానం..
ఉత్తరాది నుంచి వచ్చి తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన దీక్షా పంత్, అల్లు అర్జున్ నటించిన ‘వరుడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘రచ్చ’, ‘ఒక లైలా కోసం’, ‘గోపాలా గోపాలా’, ‘శంకరాభరణం’, ‘సొగ్గాడే చిన్ని నాయన’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఫేమ్తోనే ఆమె బిగ్‌బాస్ తెలుగు సీజన్ 1లో కూడా పాల్గొన్నారు. బిగ్‌బాస్ ఇంట్లో తన అద్భుతమైన ప్రదర్శనతో ఫైనల్‌కు ఒక అడుగు దూరంలో నిలిచి, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
సెక్స్ అండ్ సక్సెస్ థియరీపై దీక్షా పంత్ కామెంట్స్
ఇంటర్వ్యూలో యాంకర్ క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రస్తావిస్తూ, “సెక్స్ అండ్ సక్సెస్ రెండూ హ్యాపీయే.. మొదటిది నువ్వు ఇస్తే, రెండోది ఆటోమేటిక్‌గా వస్తుంది” అనే థియరీపై మీ అభిప్రాయం ఏమిటని ప్రశ్నించారు. దీనికి దీక్షా పంత్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. “అలా చేస్తే ఇంత టాలెంట్ పరిశ్రమలోకి వచ్చేది కాదు. అయితే, ఇద్దరికీ ఇష్టం ఉన్నప్పుడు మధ్యలో ఉన్నవాళ్లకు వచ్చిన సమస్య ఏంటి?” అని ఎదురు ప్రశ్నించారు.
అయితే, వ్యక్తిగతంగా తాను అలాంటి విధానానికి పూర్తిగా వ్యతిరేకమని ఆమె స్పష్టం చేశారు. “నేను ఇప్పటివరకు అలాంటి సమస్యను ఎదుర్కోలేదు. ఎవరికి ఏది కరెక్ట్ అనిపిస్తే అది వాళ్ళు చేయాలి. నేను మాత్రం అలాంటి వాటికి దూరంగా ఉంటాను” అని చెప్పారు. కెరీర్ ప్రారంభంలో అవకాశాల కోసం ప్రయత్నించినప్పుడు కొందరు వేరుగా సైగలు చేసేవారని, తాను నేరుగా ముఖం మీదే ‘నో’ చెప్పేదానినని తెలిపారు. దానివల్ల అవకాశాలు కోల్పోయానని, అందరితో క్లోజ్‌గా ఉండలేకపోవడం వల్లే నటిగా తాను అనుకున్నంత విజయం సాధించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. దీక్షా పంత్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.