Kalki 2: ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ నుండి దీపికా పదుకొణె అవుట్..!
Kalki 2: గత సంవత్సరం సంచలనం సృష్టించిన, అంతర్జాతీయంగా ఎన్నో పురస్కారాలు అందుకున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సీక్వెల్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో చిత్ర బృందం ఒక అనూహ్యమైన ప్రకటన చేసింది. సినిమా నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్, తమ సోషల్ మీడియా ద్వారా కల్కి 2 సీక్వెల్ నుండి కథానాయిక దీపికా పదుకొణె తప్పుకున్నట్లు అధికారికంగా ధ్రువీకరించింది.
ఈ ప్రకటన అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. మొదటి భాగంలో సుమతి పాత్రలో అద్భుతమైన నటనతో సినిమాకు హైలైట్‌గా నిలిచిన దీపికా, సీక్వెల్‌లో కూడా కొనసాగుతారని అందరూ భావించారు. కానీ, నిర్మాణ సంస్థ చేసిన పోస్ట్ ఈ అంచనాలను పూర్తిగా మార్చివేసింది. “చాలా జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత, మేము ఒక నిర్ణయానికి వచ్చాము. ‘కల్కి’ సీక్వెల్‌లో దీపికా భాగం కాదని అధికారికంగా తెలియజేస్తున్నాం.
మొదటి భాగంలో ఆమెతో మా ప్రయాణం ఎంతో అద్భుతంగా సాగింది. గొప్ప టీమ్‌తో కల్కి సీక్వెల్ మీ ముందుకు వస్తుంది. భవిష్యత్తులో దీపికా మరిన్ని మంచి చిత్రాలతో అలరించాలని కోరుకుంటున్నాం,” అని వైజయంతీ మూవీస్ తమ పోస్ట్‌లో పేర్కొంది.
ఈ పరిణామం గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న పుకార్లకు బలం చేకూర్చింది. ఇటీవల ఆమె కొన్ని భారీ ప్రాజెక్టుల నుంచి వైదొలగుతున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ‘కల్కి’ లాంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ నుంచి ఆమె బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. ప్రభాస్ నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో దీపిక స్థానంలో ఇక ఎవరు నటిస్తారనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ పాత్ర కోసం కొత్త నటిని తీసుకుంటారా లేక వేరే నటిని ఎంచుకుంటారా అనేది త్వరలో తెలియనుంది.