కర్ణాటక గోకర్ణ సమీపంలోని ఓ గుహలో జీవనం సాగిస్తున్న రష్యన్ మహిళ, తన ఇద్దరు కుమార్తెలను పోలీసులు ఆశ్రమంలో ఉంచిన విషయం తెలిసిందే. ఆమెను పోలీసులు విచారించగా ఆసక్తికర విషయాలను చెప్పినట్లు అధికారులు వెల్లడించారు. గత కొన్నేళ్లుగా వివిధ దేశాల్లో పర్యటించిన సదరు రష్యన్ మహిళ నైనా కుటినా (40).. ఆ వివరాలను ఆమె చెప్పగా పోలీసులు అవాక్కయ్యారు.
గత 15 ఏళ్లలో ఆమె ఏకంగా 20 దేశాల్లో పర్యటించింది. ఆయా దేశాల్లోనే అడవుల్లోనే ఆమె గడిపింది. గుహల్లో తలదాచుకుంది. అలా నలుగురు పిల్లలకు గుహల్లోనే జన్మనిచ్చింది. ఆమెకు మొత్తంగా నలుగురు సంతానం కాగా, అందులో ఇద్దరు మరణించారు. మరో ఇద్దరు కుమార్తెతో ఆమె గోకర్ణ సమీపంలోని గుహలో పోలీసుల కంటపడింది.
గోవా గుహలో నార్మల్ డెలివరీ..
భారత్‌కు వచ్చిన తర్వాత ఆమె కొంతకాలం గోవా సమీపంలోని ఓ గుహలో జీవించింది. ఆ సమయంలోనే ఆమెకు ఓ బిడ్డ జన్మించింది. కాగా ఆ బిడ్డ గోకర్ణ గుహలో మరణించినట్లు రష్యన్ మహిళ పోలీసుల విచారణలో వెల్లడించింది. ఆస్పత్రులు, వైద్యులు.. ఇలా ఎవరి సాయం లేకుండానే తాను నార్మల్ డెలివరీ అయినట్లు నైనా కుటినా తెలిపింది. ఆమె భర్త ఇజ్రాయెల్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త అని తెలిపినట్లు అధికారులు వెల్లడించారు. ఆమె ఇండియాకు కూడా వ్యాపార వీసాపైనే వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఆమె ఇచ్చిన సమాచారంతో రష్యన్ మహిళ భర్తను విదేశీయాలు ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయం గుర్తించినట్లు తెలుస్తోంది.
అయితే తాను అడవుల్లో ప్రశాంతంగా జీవిస్తున్నట్లు ఆమె పోలీసులకు చెబుతోంది. ప్రశాంత జీవనం నుంచి అసౌకర్యమైన, మురికి ప్రదేశానికి తీసుకువచ్చారని పోలీసులపై నైనా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమకు వ్యక్తిగత గోప్యత లేకుండా చేస్తున్నారని, కేవలం అన్నం మాత్రమే పెడుతున్నారని వాపోతోంది.
ఆమె అడవిలోని గుహలో ఉంటూ తన కుమార్తెలకు పెయింటింగ్ నేర్పిస్తున్నానని చెబుతోంది. అలా వేసిన పెయింటింగ్‌లు అమ్మి, అలాగే ప్రకృతి వీడియోలు తీస్తూ అలా వచ్చిన డబ్బుతో తాము ప్రశాంతమైన జీవనాన్ని సాగిస్తున్నట్లు నైనా చెబుతోంది. సీజన్‌ను బట్టి కట్టెలతో, గ్యాస్‌తో వంట చేసుకుని తింటామని వెల్లడిస్తోంది.
తన కుమార్తెలకు విద్యబోధన చేస్తానని, పాటలు పాడటం నేర్పిస్తానని, కథలు చెప్పి నిద్ర పుచ్చుతానని నైనా పోలీసుల విచారణలో వెల్లడించిది. కాగా నైనాను, ఆమె పిల్లలను రష్యాకు తరలించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ ప్రక్రియకు దాదాపు నెల రోజులు పడుతుందని స్పష్టం చేశారు.